Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Off The Record: సంచలనం సృష్టిస్తున్న CJP?

Off The Record: సంచలనం సృష్టిస్తున్న CJP?

hmtv 3 days ago

Off The Record: సంచలనం సృష్టిస్తున్న CJP?

Off The Record: కాక్రోచ్. తెలుగులో బొద్దింక. ఇప్పుడీ బొద్దింకే దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

రోజు రోజుకు ఇదో సోషల్ మీడియా ఉద్యమంలా మారుతూ దేశంలో ఏండ్లుగా పాతుకుపోయిన పార్టీల పునాదులను కదలిస్తోంది. దేశ పాలనపై, వ్యవస్థలపై సెటైరికల్‌గా ప్రారంభమైన ఈ బొద్దింక పార్టీ.. నిరాదారణకు గురై నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన యువత, నిరుద్యోగులకు బ్రహ్మాస్త్రంలా మారుతోంది. స్వచ్ఛందంగా.. యువత ఈ పార్టీలో చేరుతున్నారు. ఇందులో జెన్‌-జీ యువతే ఎక్కువగా..ఉండటంతో.. భారత్‌లోనూ జెన్‌-జీ ఉద్యమానికి పురుడుపోసుకుంటుందా అన్న చర్చలు నడుస్తున్నాయి.

దేశంలో ఇప్పటికే అనేకానేక రాజకీయపార్టీలున్నాయి. కానీ, ఏ పార్టీ కూడా బొద్దింకను పేరుగా పెట్టుకొని ఉండదు. తాజాగా ఓ 30 ఏళ్ల యువకుడు అభిజీత్‌ దీప్కే ఈ పని చేశాడు. 'కాక్రోచ్‌ జనతా పార్టీ' (సీజేపీ) పేరుతో పార్టీని స్థాపించాడు. 'సెక్యులర్‌, సోషలిస్ట్‌, డెమోక్రటిక్‌, లేజీ (సోమరితనం)' తమ నినాదమని ప్రకటించాడు. ఇది దేశంలోని పరిణామాలపై ఓ వ్యంగ్య బాణం. నిరుద్యోగులు సోమరిపోతుల్లా, బొద్దింకల్లా తయారై జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు కార్యకర్తల పేరుతో వ్యవస్థ మీద దాడి చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలను వక్రీకరించారని సీజేఐ పేర్కొన్నారు. అయినప్పటికీ, ఆ వ్యాఖ్యల మీద సోషల్‌ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి. దీంట్లో భాగంగానే అభిజీత్‌ దీప్కే.. కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)ని స్థాపించినట్లుగా సోషల్‌ మీడియాలో ఈ నెల 16వ తేదీన ప్రకటించారు. పార్టీ యువత కోసం పని చేస్తుందని, ప్రజల సొమ్ము ఎటు పోతుందో నిలదీయటానికి పార్టీ పెట్టామని తెలిపారు. దీంట్లో చేరటానికి అర్హతలు.. నిరుద్యోగం, సోమరితనం , ఆన్‌లైన్‌కు అతుక్కొని ఉండటం, వ్యవస్థపై ఆగ్రహాన్ని అద్భుతంగా వెళ్లగక్కే నైపుణ్యం కలిగి ఉండటం అని పేర్కొన్నారు. ఈనెల 16న ఒక్కడితో మొదలైన ఈ పార్టీకి.. ఇప్పుడు సోషల్ మీడియాలో 14మిలియన్ల ఫాలోవర్స్ వచ్చి చేరారు.

తాము అధికారంలోకి వస్తే చేపట్టే పనుల పేరుతో సీజేపీ ఐదు అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించింది. అందులో ఒకటి.. పదవీ విరమణ చేసే ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా ఇవ్వబోము. రెండు..నిజమైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కు కోల్పోయినా దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఉపా చట్టం కింద అరెస్టు చేసి విచారణ జరుపుతాం. 3 పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచకుండానే సగం సీట్లను మహిళలకు కేటాయిస్తాం, కేంద్ర క్యాబినెట్‌లో సగం పదవులు మహిళలకు ఇస్తాం. 4 అదానీ, అంబానీలకు చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేస్తాం. దేశంలో నిజమైన స్వతంత్ర మీడియా పని చేయటానికి దారులు వేస్తాం. 5. పార్టీ ఫిరాయించే ఎంపీ, ఎమ్మెల్యేల మీద 20 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

యువత.... వ్యవస్థను విమర్శించినందుకు, అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు వారిని బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చుతూ భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన ఓ ప్రకటనను తాను 'ఎక్స్‌'లో చూశానని,,. నాకది చాలా హాస్యాస్పదంగా అనిపించిందని అభిజిత్ చెప్పారు. 'దేశ రాజ్యాంగానికి సీజేఐ సంరక్షకునిగా ఉండాలి. ఆ రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛను ఇస్తుంది. ఆ స్వేచ్ఛను కాపాడాల్సిన వ్యక్తే యువతను బొద్దింకలతో, పరాన్నజీవులతో ఎలా పోల్చగలరని అభిజిత్ ప్రశ్నించారు. 'దీనిపై నాకు కోపం, నిరాశ కలిగాయి. నా అభిప్రాయాన్ని 'ఎక్స్'లో వ్యక్తం చేశాను. బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుందని ప్రశ్నించాను. దానికి జెన్ జెడ్, 25 ఏళ్లలోపు యువత నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. 'మనమందరం ఏకమై ఒక వేదికను సృష్టించుకోవాలని వాళ్లు అన్నారని అభిజిత్ పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో 'కాక్రోచ్ జనతా పార్టీ' పేరుతో ఒక పేరడీ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. మీరు మమ్మల్ని బొద్దింకలు అని పిలిచారు కదా.. మంచిది...మేం ఆ పేరుతో పార్టీ ఏర్పాటు చేసుకుంటామని కాక్రోచ్ జనతా పార్టీ పెట్టా. ఈ పార్టీలో చేరడానికి సీజేఐ చెప్పిన, సోమరులు, నిరుద్యోగులు, నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండేవారే అర్హులనే నిబంధన పెట్టానన్నారు. ప్రజలు స్పందన గమనిస్తే, ఇది కేవలం ఒక జోక్ కాదని, యువత అసంతృప్తికి వేదికగా మారిందని అనిపించిందన్నారు అభిజిత్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu