Off The Record: తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే? ఉద్యోగులకు లాభమా? నష్టమా?
Off The Record: 90 ఏళ్ళ చరిత్ర కలిగిన తెలంగాణ ఆర్టీసీ త్వరలో ప్రభుత్వపరం కానుంది.
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఆర్టీసీ రెండుగా విడిపోయింది. 2019లో ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. అయితే తెలంగాణ ఆర్టీసీలో మాత్రం విలీనంపై ఆర్టీసీ కార్మికులు పోరాడుతూనే ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీకి సంబంధించిన విలీన ప్రక్రియపై ముందడుగు పడింది. గెజిట్ కూడా ఇచ్చారు. గవర్నర్ ఆమోదం కూడా లభించింది. కానీ అపాయింటెడ్ డే సమయానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దె దిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో విలీన అంశాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి రెండున్నారేళ్లయినా ఎలాంటి అడుగులు పడకపోవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. మూడు రోజులపాటు సమ్మె చేశారు. దీంతో దిగొచ్చిన తెలంగాణ ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి, విలీనం చేస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆర్టీసీ కార్మికులతో మాట్లాడి విలీనమా లేక ఎన్నికల అనేది నిర్ణయించుకుని రావాలని కార్మికులకు సూచించారు.
ప్రస్తుతం తెలంగాణా వ్యాప్తంగా 10,500 బస్సులుండగా అందులో 2,500 వరకు అద్దె బస్సులు ఉన్నాయి. ఆర్టీసీలో ప్రస్తుతం 38,500 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. అయితే విలీనం విషయంలో మాత్రం కార్మికులు అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా ఏపీలో విలీనం చేసిన తర్వాత కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఆ అంశాలపైనే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు దృష్టి సారించారు. అక్కడ విలీనం ఏ విధంగా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా విలీనం జరిగిన ప్రక్రియ, గత ప్రభుత్వంలోని రిపోర్టులను ముఖ్యమంత్రికి అందచేయనున్నారట.
ఏపీ విలీన ప్రక్రియను పరిశీలిస్తే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని గమనించారు. ముఖ్యంగా విలీన కమిటీలో ప్రధాన యూనియన్లకు చోటు కల్పించలేదు. దీనివల్ల కార్మికుల సమస్యలు తీరక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హెల్త్ కార్డుల విషయంలో అక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయట.గతంలో ఆర్టీసీ కార్మికులకు ట్రీట్‌మెంట్‌కు ఎంత ఖర్చయినా కార్పోరేషన్ భరించేది. కానీ ఇప్పుడు ఈహెచ్‌ఎస్ విధానం కొనసాగుతోంది. ఈ స్కీముతో అక్కడ ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. వీటన్నింటిపైనా క్లారిటీ తీసుకోవాలని తెలంగాణా ఆర్టీసీ యూనియన్లకు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణా ఆర్టీసీ కార్మిక యూనియన్లు తమ నివేదికలను ఆర్టీసీ ఎండీకి ఇస్తున్నారు. ముఖ్యంగా విలీనమైన రైల్వేకు.. అలాగే కొన్ని ప్రభుత్వ శాఖల్లో యూనియన్లకు ఎన్నికల తరహాలోనే ఆర్టీసీలో కూడా యూనియన్ల ఏర్పాటును ప్రస్తావిస్తున్నారు. ఉద్యోగి ఆరోగ్య భద్రత విషయానికి వస్తే ప్రస్తుతమున్న విధానాన్నే యధావిధిగా కొనసాగించాలని, EHS అవసరం లేదన్న అభిప్రాయానికి కార్మికులు వచ్చినట్టు చెబుతున్నారు.
ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు ప్రభుత్వంపై నెలకు 250 కోట్ల అదనపు భారం పడినట్టు ఏపీలోని కార్మిక నేతలు చెబుతున్నారు. అంటే సంవత్సరానికి 3వేల కోట్ల రూపాయలు ప్రభుత్వంపై అదనపు భారం పడిందన్న మాట. ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న ఆర్టీసీ కార్మికులను విలీనం చేసినా ప్రభుత్వంపై దాదాపు అంతే భారం పడనుంది. అయితే ఏపీలో ఆర్టీసీకి వస్తున్న ఆదాయంలో 25 శాతం ప్రభుత్వం తీసుకుంటోంది. ఇక్కడ కూడా అదే తరహాలో అమలు చేసే అవకాశం ఉన్నట్టు చర్చ నడుస్తోంది. ప్రభుత్వం కూడా ఆయా అంశాలపై ఎక్కువ సాగదీయకుండా ఆర్టీసీ ఎండీ నుంచి రిపోర్ట్ రాగానే త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని చూస్తోందట. మరోవైపు ఆర్టీసీకి సంబంధించిన ఆస్తుల వ్యవహారం ఇంకా షిలాభిడే కమిటీ నుంచి రిపోర్ట్ రాలేదు. దీంతో ఆ ఆస్తులకు సంబంధించి పంపకాల వ్యవహారాన్ని కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. ఆస్తుల వ్యవహారం క్లియర్ అయితే ఆ స్థలాలను వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దాని ద్వారా కొంత మేర ఆర్ధిక లోటు పూడ్చుకునే అవకాశం ఉన్నట్టు భావిస్తోంది ప్రభుత్వం..

