Oil Palm: మన దేశంలో వ్యవసాయ రంగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. సాంప్రదాయ పంటల కంటే తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో ఏళ్ల తరబడి స్థిరమైన మరియు భారీ ఆదాయాన్ని అందించే వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.
అలాంటి పంటల్లో 'పామాయిల్' సాగు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా మారింది.
భారతదేశం తన వంట నూనెల అవసరాల కోసం ఏటా దాదాపు 60% పైగా విదేశాలపైనే ఆధారపడుతోంది. దేశీయంగా వాడే 16 మిలియన్ టన్నుల వంట నూనెలో సింహభాగం (56%) పామాయిలే ఉంటోంది. రూ. 1.6 లక్షల కోట్ల భారం: ఈ దిగుమతుల కోసం మన దేశం ఏటా రూ. 1.6 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది.
విదేశీ మారక ద్రవ్యాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు వంట నూనె వాడకాన్ని 10% మేర తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశీయంగా పామాయిల్ ఉత్పత్తి పెరిగితే దిగుమతులు తగ్గి, వేలాది కోట్ల రూపాయల దేశీ సొమ్ము ఆదా అవుతుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ సాగును ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతులకు భారీగా సబ్సిడీలు ఇస్తున్నాయి.
ఆయిల్ పామ్ సాగుకు తెలుగు రాష్ట్రాల వాతావరణం అత్యంత అనుకూలమైనదిగా నిపుణులు చెబుతున్నారు. వెచ్చని, తేమతో కూడిన ఉష్ణమండల వాతావరణం అవసరం. సంవత్సరంలో ఉష్ణోగ్రతలు 20°C నుండి 30°C వరకు ఉండాలి. ఏడాదికి 2500 మి.మీ నుండి 4000 మి.మీ వర్షపాతం అనుకూలం. అయితే, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటితోనే ఈ పంటను సమర్థవంతంగా పండించవచ్చు. బంకమట్టి, సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉన్న ఒండ్రు మట్టి నేలలు ఈ పంటకు జీవం పోస్తాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మిజోరం, అస్సాం వంటి రాష్ట్రాల్లో సాగు జరుగుతున్నప్పటికీ.. విస్తరణలో మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దేశంలోనే ముందున్నాయి.
మొలకెత్తిన పామాయిల్ విత్తనాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, వాటిని పొలాల్లో నాటడానికి వీలుగా సుమారు 18 నెలల పాటు నర్సరీల్లో జాగ్రత్తగా పెంచుతారు. మొక్కలు నాటిన తర్వాత అవి కాపుకు రావడానికి 4 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ మొదటి ఐదేళ్లు మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటే, ఆ తర్వాత ఏకధాటిగా 25 సంవత్సరాల పాటు ఎలాంటి ఢోకా లేకుండా నిరంతరం దిగుబడిని ఇస్తుంది. ఈ కాలంలో అంతర పంటలుగా కోకో, వేరుశనగ లేదా ఇతర కూరగాయలను పండిస్తూ అదనపు ఆదాయం కూడా పొందవచ్చు.

