Osmania University: నీట్ లీకేజీపై ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్‌యూఐ నిరసన
Osmania University: నీట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఏన్టీఏ)ను రద్దు చేయాలని ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు.
నీట్ పరీక్ష లీకేజీని నిరసిస్తూ ఎన్ఎస్ యుఐ నాయకుడు కోట దుర్గరాజు ఆధ్వర్యంలో ఎన్ టి ఏ దిష్టిబొమ్మను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోట దుర్గరాజు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం మూలాన 23 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులకు గురైయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు రోజుల క్రితం మహారాష్ట్ర లో రితిక్ మిశ్రా అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత లో జరిగిన లీకేజీలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాధాకృష్ణ కమిటీ నీట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని చెప్పిన అమలు చేయకుండా విద్యార్థుల భవిష్యత్తు నిర్వీర్యం చేశారని, తల్లిదండ్రులకు క్షోభను మిగిలించారని మండిపడ్డారు.
విద్యార్థులు మేధావులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. నీట్ పరీక్ష నిర్వహణను రాష్ర్టాలకే అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్,యాదవ్, రత్నం, శేఖర్ రెడ్డి, సురేందర్, శేఖర్, రాము, బాబు, వినయ్, మురళీ, మహేందర్, రవి, తదితరులు పాల్గొన్నారు.

