Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Paidi Rakesh Reddy: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు పైడి రాకేష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!

Paidi Rakesh Reddy: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు పైడి రాకేష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!

hmtv 2 weeks ago

Paidi Rakesh Reddy: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు పైడి రాకేష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!

Paidi Rakesh Reddy: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది.

నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన విసిరిన రాజకీయ సవాల్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. "మహేష్ కుమార్ గౌడ్‌కు దమ్ముంటే తన ఎమ్మెల్సీ పదవికి తక్షణమే రాజీనామా చేసి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలి. ఆయనకు పోటీగా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బరిలోకి దిగుతా. ఎవరు గెలుస్తారో నిజామాబాద్ ప్రజల సమక్షంలోనే తేల్చుకుందాం" అని రాకేష్ రెడ్డి సవాల్ చేశారు.

మహేష్ కుమార్ గౌడ్ ఒక పైరవీకారుడని, జీవితంలో ఒక్క ఎన్నికల్లో కూడా గెలవకుండా వెనుకదారిలో పదవులు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. పీసీసీ చీఫ్ హోదాలో ఉండి కూడా నిజామాబాద్ జిల్లా ప్రయోజనాల కోసం ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరావత్రి అనిల్‌తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే 'కబర్దార్' అంటూ తీవ్రంగా హెచ్చరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఇన్‌ఛార్జ్ నితిన్ నవీన్ ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నేత అని.. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ అధిష్ఠానానికి డబ్బులు ఇచ్చుకుని పదవి కొనుక్కున్న వ్యక్తి అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు పదవి ఊడుతుందో తెలియక ఎగిసెగిసి పడుతున్నారని, కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా త్వరలోనే సీఎంను మార్చడం ఖాయమని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతికి బీజేపీ అడ్డుపడుతోందనే అక్కసుతోనే మా పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూరియా యాప్ విధానం రైతుల పాలిట శాపంగా మారిందని రాకేష్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారని, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై బీజేపీ క్షేత్రస్థాయిలో పోరాడుతుందని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu