Dailyhunt
Pakistan Economic Crisis 2026:  పతనం అంచున పాకిస్తాన్‌...ఈనెలాఖరులోగా అప్పు చెల్లించకుంటే

Pakistan Economic Crisis 2026: పతనం అంచున పాకిస్తాన్‌...ఈనెలాఖరులోగా అప్పు చెల్లించకుంటే

hmtv 3 weeks ago

Pakistan Economic Crisis 2026: పతనం అంచున పాకిస్తాన్‌...ఈనెలాఖరులోగా అప్పు చెల్లించకుంటే

Pakistan Economic Crisis: మన పొరుగుదేశం పాకిస్తాన్‌ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది.

ఈ నెలాఖరులోగా 3.5బిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు 32,500 కోట్ల రుణాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆ దేశం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు రుణాలను, రుణ గడువును పొడిగిస్తూ వచ్చిన యూఏఈ ఈసారి రోలోవర్‌కు నిరాకరించింది. ఇది పాకిస్తాన్‌కు అతిపెద్ద షాక్‌గా మారింది.

నిరాకరణకు కారణమేంటి?

పాకిస్తాన్‌ తన రోజువారి పరిపాలన నిర్వహణ కోసం వివిధ దేశాల నుంచి రుణాలను తెచ్చుకుంటూ కాలం గడుపుతున్నది. ఇందులో భాగంగానే 2019ల7 యూఏఈ నుంచి 2 బిలియన్‌ డాలర్లు, 2023లో మరో 1.5 బిలియన్‌ డాలర్ల రుణాలను తెచ్చుకుంది. ఈ రుణాల చెల్లింపును ప్రతి ఏడాది పొడిగిస్తూ వచ్చింది. యూఏఈ, పాక్‌ మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా రుణాల చెల్లింపు గడువును యూఏఈ పొడిగిస్తూ వచ్చింది. కానీ, 2026లో ఈ చెల్లింపు పొడిగింపును యూఏఈ నిరాకరించింది. పైగా ఏప్రిల్‌ నెలాఖరు వరకు 3.5 బిలియన్‌ డాలర్లను ఖచ్చితంగా చెల్లించాలని తెగేసి చెప్పింది. యూఏఈ ఇలా పాకిస్తాన్‌కు రోలోవర్‌కు నో చెప్పడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వలన యూఏఈకి భారీ నష్టం వాటిల్లింది. దేశంలోని ఆయిల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఇరాన్‌ దాడులు చేస్తున్నది. ఇప్పుడు యూఏఈ యుద్ధంలో పాల్గొనాలి అన్నా లేదా యుద్ధం ముగిసిన తరువాత దేశాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురావాలన్నా నిధులు అవసరం. ఇచ్చిన అప్పులను రాబట్టుకోవడమే మంచిదని యూఏఈ భావిస్తోంది. ఇందులో భాగంగానే పాక్‌పై ఒత్తిడి తీసుకొస్తోంది.

పాకిస్తాన్‌ రిజర్వులు

2026 మార్చి 27 నాటికి పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వులు) కేవలం 16.38 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఇవి దేశానికి మూడు నెలల దిగుమతులకు సరిపడే స్థాయిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ రుణం చెల్లిస్తే, రిజర్వులు ఒక్కసారిగా పడిపోవడం ఖాయం. ఇదే సమయంలో మరో 1.3 బిలియన్ డాలర్ల యూరోబాండ్ చెల్లింపులు కూడా చేయాల్సి ఉంది. దీన్ని బట్టి చూస్తే పాక్‌ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్ధమౌతుంది. ఈ ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌లోని KSE-100 సూచీ 2026 తొలి త్రైమాసికంలోనే 15% పడిపోయింది. విదేశీ మారక నిల్వలు తగ్గితే పాకిస్థాన్ రూపాయి విలువ పడిపోవడం సహజం. డాలర్ ధర పెరగడం వల్ల దిగుమతుల ఖర్చు మరింత పెరుగుతుంది.

ఆశలన్నీ ఏఎంఎఫ్‌పైనే

ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 1.2 బిలియన్ డాలర్ల రుణం కోసం ఎదురుచూస్తోంది. స్టాఫ్ స్థాయిలో అంగీకారం వచ్చినప్పటికీ, తుది ఆమోదం ఇంకా రావాల్సి ఉంది. ఈలోపు రిజర్వులు క్షీణిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.

సాధారణ ప్రజలపై ప్రభావం

ఈ ఆర్థిక సంక్షోభం సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతుంది. దిగుమతులు తగ్గితే చమురు, ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయి. ఒక సాధారణ కుటుంబం నెలవారీ ఖర్చులు 20% నుంచి 30% వరకు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలు తగ్గడం, జీతాల ఆలస్యం, పరిశ్రమల మందగమనం వంటి సమస్యలు మరింత తీవ్రంగా మారవచ్చు.

తగ్గుతున్న నమ్మకం

ఇప్పటివరకు UAE, సౌదీ అరేబియా, చైనా వంటి దేశాలు పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చాయి. కానీ ఇప్పుడు రోలోవర్ నిరాకరణ ఒక హెచ్చరికగా భావిస్తున్నారు. పెట్టుబడుల రూపంలో ఆస్తులను ఇవ్వాలనే పాకిస్థాన్ ప్రతిపాదనపై కూడా విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్‌లో ఆస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టినా ఉపయోగం లేదని ఆయా దేశాలు భావిస్తున్నాయి. దీనికి ఉదాహరణ చైనా పాకిస్తాన్‌ సిల్క్‌ కారిడార్‌. ఈ కారిడార్‌లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. కానీ, ఇప్పటి వరకు ఈ కారిడార్‌ గుండా అధికారికంగా, అనుకున్నంతగా రవాణా సాగడం లేదు. దీని వలన చైనాకు భారీ నష్టం వాటిల్లిందనే చెప్పొచ్చు.

పాకిస్తాన్‌ ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఎగుమతులను పెంచడం, దిగుమతులను నియంత్రించడం, ఆర్థిక సంస్కరణలు చేపట్టడం ఒక్కటే పరిష్కారం. లేకపోతే ఇలాంటి సంక్షోభాలు వరుసగా ఎదురయ్యే ప్రమాదం ఉంది. వడ్డీ రేట్లు పెంచడం, ఖర్చులను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రుణాల చెల్లింపులు, తగ్గుతున్న రిజర్వులు, పెరుగుతున్న ఖర్చులు కలిపి పాకిస్తాన్‌కు పెద్ద పరీక్షగా మారాయి. ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే బయటపడే అవకాశం ఉంది. లేదంటే దేశంలో ఆర్థికమాంద్యం లేదా దివాళా తీసే పరిస్థితులు తలెత్తవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu