Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Parvathipuram: 15లోగా భద్రగిరి, కురుపాం ఆసుపత్రులు సిద్ధం కావాలి

Parvathipuram: 15లోగా భద్రగిరి, కురుపాం ఆసుపత్రులు సిద్ధం కావాలి

hmtv 2 weeks ago

Parvathipuram: 15లోగా భద్రగిరి, కురుపాం ఆసుపత్రులు సిద్ధం కావాలి

పార్వతీపురం: మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు అధునాతన, నాణ్యమైన వైద్య సౌకర్యాలను సకాలంలో అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు.

నిర్మాణ దశలో ఉన్న భద్రగిరి, కురుపాం ఆసుపత్రుల పనులను అన్ని హంగులతో ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.గురువారం ఏపిఎంఎస్ఐడిసీ చేపట్టిన ఆసుపత్రి భవన నిర్మాణాల ప్రగతిపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అధికారులు కూడా అదే చిత్తశుద్ధితో పనిచేసి నిర్దేశిత గడువులోగా ఆసుపత్రులను ప్రారంభానికి సిద్ధం చేయాలని అన్నారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోని రోగులు అత్యవసర వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే అవస్థలు తప్పాలన్నదే ఈ ఆసుపత్రుల ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ గుర్తుచేశారు. పనుల్లో వేగం పెంచేందుకు వీలుగా 'భద్రగిరి', 'కురుపాం' ఆసుపత్రుల పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి, రోజువారీ ప్రగతిని పర్యవేక్షించాలని పార్వతీపురం, సీతంపేట ఐటిడిఏ పీఓలను ఆదేశించారు.

పీహెచ్‌సీల ముస్తాబు తరహాలో ఈ ఆసుపత్రుల్లో కూడా రోగులకు ఉపశమనం కలిగించేలా సుందరీకరణ పనులు చేపట్టాలని, అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. గత సమీక్షకు, ఈ సమీక్షకు మధ్య క్షేత్రస్థాయిలో జరిగిన మార్పులను స్పష్టమైన డిజిటల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సాలూరు ఏరియా ఆసుపత్రిలో గిరిజనులకు అందుతున్న సేవలపై సమీక్షిస్తూ, అక్కడ ఇంకా పెండింగ్‌లో ఉన్న ప్రహరీగోడ, ఆక్సిజన్ పైపులైన్లు, అప్రోచ్ రోడ్డు వంటి పనులను కూడా ఈ నెల 15 లోగా ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని కలెక్టర్ డెడ్‌లైన్ విధించారు.

అలాగే చినమేరంగి, పాలకొండ, సీతంపేట మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి గిరిజనులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు అధికారులకు వృత్తిధర్మంతో పాటు మానవతా దృక్పథం ఉండాలని, వీలైనంత త్వరగా ఆసుపత్రి భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసి, పేద గిరిజనులకు వైద్యం అందేలా ఇంజినీరింగ్ అధికారులు ఆలోచన చేయాలన్నారు. పనుల ఆధారంగానే గుత్తేదారులకు నిధుల చెల్లింపులు జరుగుతాయి కాబట్టి, వారితో మాట్లాడి పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu