Parvathipuram: పర్యావరణ పరిరక్షణే లక్ష్యం: చెరువుల వద్ద క్లీన్ స్వీప్ చేపట్టిన కలెక్టర్
పార్వతీపురం: జిల్లాలోని చెరువుల పరిరక్షణ, మురుగునీటి కాలువల ఆధునీకరణ మరియు ప్రజా ఆరోగ్య రక్షణే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా.
ఎన్. ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక శివాలయం చెరువు వద్ద ముమ్మరంగా సాగుతున్న 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' పనులను, నూతనంగా అందుబాటులోకి వచ్చిన వాకింగ్ ట్రాక్‌ను శనివారం నాడు పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు మున్సిపల్ అధికారులతో మాట్లాడి పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ పరిధిలోని జనావాసాలు, చెరువుల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' లో భాగంగా శివాలయం చెరువు పక్కనే ఉన్న డ్రైన్లు, స్టామ్ వాటర్ డ్రైన్లు (వరద నీటి కాలువలు) మరియు నాలాల్లో పూడికతీత పనులను ముమ్మరం చేయించాం. వర్షాకాలం రానున్న నేపథ్యంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా, మురుగునీరు సజావుగా సాగిపోయేలా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
జిల్లాలోని చెరువులు, కాలువలు, ఇతర జల వనరుల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని కలెక్టర్ తెలిపారు. భూగర్భ జలాల మట్టాలు పడిపోకుండా వర్షపు నీటిని సక్రమంగా సంరక్షించుకోవాలని సూచించారు. చెరువుల ఆక్రమణలను నివారించడం, నీటి వనరుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చన్నారు.జల వనరుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో స్థానికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.శివాలయం చెరువు వద్ద ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్‌ను పరిశీలించిన కలెక్టర్, దీనిని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పారిశుధ్య పనులు, డ్రైన్ల క్లీనింగ్ నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించకూడదని మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బందిని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు.

