పార్వతీపురం: పివిటిజి (గిరిజన) ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పీఎం జన్మన్' (PM JANMAN) హౌసింగ్ స్కీం పనులను వేగవంతం చేయాలని ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్.వైశాలి అధికారులను ఆదేశించారు.
గురువారం తన చాంబర్‌లో హౌసింగ్ శాఖ అధికారులతో కలిసి ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ.. గృహ నిర్మాణ పథకం ప్రస్తుత పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నిర్దేశించిన కాలపరిమితిలోగా లక్ష్యాలను అధిగమించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను (ప్లాన్ ఆఫ్ యాక్షన్) అమలు చేయాలని, మండలాల వారీగా నిర్దేశించిన టార్గెట్లను అధికారులు బాధ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

