Parvathipuram: పీఎం-కిసాన్ ఇ-కెవైసి తప్పనిసరి: వ్యవసాయ అధికారి భవానీ శంకర రావు
పార్వతీపురం : జిల్లాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం-కిసాన్ పథకం కింద ఇ-కెవైసి (ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భవానీ శంకర రావు ఒక ప్రకటనలో కోరారు.
అర్హులైన భూస్వామ్య రైతులకు సంవత్సరానికి రూ.6,000/- ఆర్థిక సహాయం నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతోందని, ఈ లబ్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే ఇ-కెవైసి తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ మొబైల్ ద్వారా PM-KISAN పోర్టల్ లేదా యాప్‌లో ఓటీపీ ఆధారంగా గానీ, లేదా 'ఫేస్ అథెంటికేషన్' ద్వారా గానీ స్వయంగా ఇ-కెవైసి చేసుకోవచ్చని తెలిపారు. బయోమెట్రిక్ విధానం కోసం సమీపంలోని గ్రామ రైతు సేవా కేంద్రాల ఇంఛార్జీలను లేదా సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించవచ్చన్నారు.
నమోదులు వేగవంతం చేయాలి
ఇ-కెవైసితో పాటు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న APAIMS రైతు నమోదులు, APFR నమోదులను కూడా రైతులు వెంటనే పూర్తి చేయాలని వ్యవసాయ అధికారి సూచించారు. గ్రామ స్థాయిలో ఈ ప్రక్రియలను వేగవంతం చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని, రైతులందరూ తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి ఈ నమోదులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

