పార్వతీపురం: గ్రామీణ పారిశుధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 'స్వచ్ఛభారత్ మిషన్' (SBM - Phase 2) చివరి ఏడాది ప్రణాళికలను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది.
2026-2027 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో స్వచ్చంద్రా కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. బి అర్జున రావు జిల్లా కలెక్టర్ గారికి పలు అంశాలు వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో కేవలం 36 మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది.
కాగా, మరో 2,477 మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రస్తుతం వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. పరీక్షాత్మక ప్రాతిపదికన చేపడుతున్న ఈ పనులకు సంబంధించిన నిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాప్స్ లేదా వృథా కాకుండా చూడాలని, ఆయా మండలాల అధికారులు ఆన్-గ్రౌండ్ పనులను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఏయే ఆఫీస్ ఏ విధంగా ఇన్‌వాల్వ్ అయ్యి ఈ పనులను 100 శాతం విజయవంతం చేయాలనే దానిపై స్పష్టమైన కార్యాచరణను రూపొందించారు.
సొంతంగా మరుగుదొడ్లు లేని ప్రతి లబ్ధిదారుడికి ఈ పథకం వర్తించేలా చూడాలని, నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేసి జిల్లాను వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

