Peddapalli: బోనాల ఉత్సవాల్లో దళిత మహిళలపై వివక్ష!
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో ఘోరమైన కుల వివక్ష ఘటన వెలుగుచూసింది.
గ్రామంలో ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు ఈసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. అమ్మవారి కొలుపుల సందర్భంగా స్థానిక గౌడ కులస్తులతో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన దళిత మహిళలు కూడా భక్తిశ్రద్ధలతో బోనాలను సిద్ధం చేసుకుని ఆలయానికి కాలినడకన బయలుదేరారు.
బోనాలను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు: రాత్రి సమయంలో దళిత మహిళలు బోనాలతో ఆలయ సమీపానికి చేరుకోగా.. అక్కడ ఉన్న కొందరు గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళలు వారిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా, కులం పేరుతో తీవ్రంగా దూషించినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భక్తితో సమర్పించాల్సినp బోనాల ఉత్సవాల్లో ఇలాంటి వివక్ష చూపడంపై దళిత సామాజిక వర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగు గంటల పాటు రాస్తారోకో - స్తంభించిన ట్రాఫిక్: తమకు జరిగిన అవమానానికి నిరసనగా దళిత మహిళలు బోనాలతో సహా ప్రధాన రహదారిపైనే బైఠాయించారు. కుల వివక్షకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ 'రాస్తారోకో'కు దిగారు. ఉదయం నుంచి సుమారు నాలుగు గంటల పాటు ఈ ఆందోళన కొనసాగడంతో.. అటు ఇటు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
రంగంలోకి పోలీస్ బాసులు - ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు: ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి, సుల్తానాబాద్ సీఐ రంజిత్ రెడ్డి తమ పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. దళిత మహిళలను అడ్డుకుని, కులం పేరుతో దూషించిన వారిపై కచ్చితంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ రామ్‌రెడ్డి గట్టి హామీ ఇచ్చారు.
ఉన్నతాధికారుల భరోసాతో దళిత మహిళలు తమ రాస్తారోకోను విరమించారు. ప్రస్తుతం పెగడపల్లి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

