Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pithapuram: 'మోడల్ నియోజకవర్గం' దిశగా పిఠాపురంలో రోడ్ల అభివృద్ధి!

Pithapuram: 'మోడల్ నియోజకవర్గం' దిశగా పిఠాపురంలో రోడ్ల అభివృద్ధి!

hmtv 5 days ago

Pithapuram: 'మోడల్ నియోజకవర్గం' దిశగా పిఠాపురంలో రోడ్ల అభివృద్ధి!

పిఠాపురం: రహదారులు ఒక ప్రాంత అభివృద్ధికి అద్దం పడతాయి. గ్రామాలను పట్టణాలతో, రైతును మార్కెట్‌తో, విద్యార్థిని పాఠశాలతో, రోగిని ఆసుపత్రితో అనుసంధానించే ప్రధాన మౌలిక సదుపాయం రహదారి.

ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి, స్థానిక శాసనసభ్యుడు శ్రీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టితో చేపట్టిన రహదారుల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన "మోడల్ నియోజకవర్గం" హామీని అమలు చేసే దిశగా గ్రామీణ రహదారుల నుంచి తీర ప్రాంత మత్స్యకార కాలనీలు, వ్యవసాయ డొంక రోడ్ల వరకు విస్తృత స్థాయిలో నిర్మాణాలు చేపట్టారు. రెండేళ్లలోనే వందలాది రోడ్లు పూర్తవడంతో పిఠాపురం రూపురేఖలు మారుతున్నాయి.

*రూ.207 కోట్లతో భారీ రోడ్ల ప్రణాళిక*

పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం రూ.207 కోట్లతో 307 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, రోడ్లు-భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నిధులను సమన్వయం చేస్తూ పనులు చేపట్టారు. ఇప్పటికే రూ.100 కోట్ల వ్యయంతో 611 రోడ్ల నిర్మాణం పూర్తి కాగా, వీటి మొత్తం పొడవు సుమారు 152 కిలోమీటర్లు. మరో 70కిపైగా రోడ్ల పనులు ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. లక్ష్యాల్లో దాదాపు 80 శాతం పూర్తి కావడంతో నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో రాకపోకలు సులభమయ్యాయి.

*ప్రజలు అడిగిన ప్రతి రహదారికి ప్రాధాన్యం*

ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ప్రజల నుంచి వచ్చిన వినతుల్లో అధిక శాతం రోడ్ల సమస్యలపైనే ఉండటం గమనించిన ఉప ముఖ్యమంత్రి, అవసరాల ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో రహదారులను మంజూరు చేశారు. పాఠశాలలు, దేవాలయాలు, ఆసుపత్రులు, వ్యవసాయ క్షేత్రాలు, మత్స్యకార గ్రామాలను అనుసంధానించే విధంగా పనులకు రూపకల్పన చేశారు. గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి.

*మత్స్యకార కాలనీల్లో మౌలిక వసతుల కల్పన*

ఉప్పాడ తీర ప్రాంతంలోని మత్స్యకార గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా మౌలిక వసతుల కొరత ఉండేది. మాయాపట్నం పునరావాస కాలనీలో 13 ఏళ్లుగా సిమెంటు రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం రూ.1.52 కోట్లతో 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 2.8 కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థ నిర్మించింది. దీంతో కాలనీ మొత్తం కొత్త రూపును సంతరించుకుంది.అదేవిధంగా కొత్తసూరాడపేట పునరావాస కాలనీలో రూ.93 లక్షలతో 1.6 కిలోమీటర్ల సిమెంటు రోడ్లు నిర్మించి ప్రధాన రహదారికి అనుసంధానం చేశారు. జెట్టీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో కూడా గ్రావెల్ రోడ్లు వేయడంతో మత్స్యకారులు చేపల రవాణా సులభంగా నిర్వహించే పరిస్థితి ఏర్పడింది.

*తుపాన్లతో దెబ్బతిన్న రహదారులకు పునర్జన్మ*

యు.కొత్తపల్లి మండలంలోని అమరవిల్లి-రామన్నపాలెం బీచ్ రహదారి తుపాన్లు, భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. ఈ రహదారిని రూ.88 లక్షలతో పునర్నిర్మించడంతో రెండు వేల మందికి పైగా ప్రజలకు ప్రయాణ సౌకర్యం లభించింది. బషీర్ బీబీ ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ రహదారి ఉపయోగపడుతోంది.అలాగే అభివృద్ధికి దూరంగా ఉన్న ముమ్మడివారిపాడు గ్రామానికి రూ.79.70 లక్షలతో శాశ్వత రహదారి నిర్మించారు. కొత్తపల్లి గ్రామ శ్మశానవాటికకు వెళ్లే 411 మీటర్ల సీసీ రహదారిని రూ.26.30 లక్షలతో నిర్మించి నాలుగు వేల మందికి ప్రయోజనం కల్పించారు.

*కొండెవరం రహదారి.. 8 వేల మందికి ఊరట*

యు.కొత్తపల్లి మండలంలోని కొండెవరం గ్రామానికి అనుసంధానంగా ఉన్న పిఠాపురం-ఉప్పాడ రహదారి ఏడు సంవత్సరాలుగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రూ.1.22 కోట్ల ఉపాధి హామీ నిధులతో 3.17 కిలోమీటర్ల రహదారి నిర్మించడంతో దాదాపు ఎనిమిది వేల మంది ప్రజలకు ప్రయాణ సౌలభ్యం ఏర్పడింది. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఇది ప్రధాన మార్గంగా మారింది.

*గోతుల రహదారులకు శాశ్వత పరిష్కారం*

గొల్లప్రోలు మండలం వెన్నెపూడి గ్రామం నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గం రెండు దశాబ్దాలుగా దెబ్బతిని ఉండేది. రూ.85 లక్షలతో 1.60 కిలోమీటర్ల రహదారి నిర్మించడంతో 3,800 మంది ప్రజలకు ప్రయోజనం చేకూరింది.

గొల్లప్రోలు-తాటిపర్తి పుంత రోడ్డును రూ.1.46 కోట్లతో 2.90 కిలోమీటర్ల బీటీ రహదారిగా అభివృద్ధి చేశారు. కొడవలి గ్రామంలో 370 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం నాలుగు వేల మందికి ఉపశమనం కల్పించింది...

*ఈబీసీ కాలనీకి ఆధునిక మౌలిక వసతులు*

చిత్రాడ గ్రామంలోని ఈబీసీ కాలనీలో రూ.3 కోట్లతో 1,500 మీటర్ల సీసీ రోడ్లు, ఆధునిక డ్రైనేజీ నిర్మించారు. ఇదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.50 లక్షలతో ప్రహరీ గోడ నిర్మించి విద్యార్థుల భద్రతను మెరుగుపరిచారు...

*వ్యవసాయానికి డొంక రోడ్లతో బలం*

పల్లెపండుగ-2.0 కార్యక్రమంలో రైతుల అవసరాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. పి.రాయవరం, బి.ప్రత్తిపాడు ప్రాంతాల్లో రూ.కోటికి పైగా వ్యయంతో మూడు కిలోమీటర్ల గ్రావెల్ డొంక రోడ్లు నిర్మించారు. దీంతో దాదాపు 200 ఎకరాల వ్యవసాయ భూములకు నేరుగా రహదారి సౌకర్యం కల్పించబడింది. పంటల రవాణా ఖర్చు, సమయం తగ్గి రైతులకు ఉపయోగపడుతోంది.

*పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి*

రహదారుల నిర్మాణ పనుల పురోగతిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా అధికారులతో సమీక్షిస్తున్నారు. నిర్మాణం ఆలస్యమైన 70 కిలోమీటర్ల రోడ్ల పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నిరంతర పర్యవేక్షణతో పనులు జరగాలని స్పష్టం చేశారు.

*మోడల్ నియోజకవర్గం దిశగా అడుగులు*

పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న రహదారుల అభివృద్ధి కేవలం మౌలిక వసతుల కల్పనకే పరిమితం కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయానికి, మత్స్యకారులకు, విద్యార్థులకు, సాధారణ ప్రజలకు నేరుగా ఉపయోగపడేలా రూపుదిద్దుకుంటోంది. తీర ప్రాంతం నుంచి లోతట్టు గ్రామాల వరకు రహదారుల విస్తరణతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మిగిలిన పనులు కూడా పూర్తయితే పిఠాపురం నిజంగానే ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన మోడల్ నియోజకవర్గంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu