Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Podili: పొదిలి పొగాకు కేంద్రంలో వైసీపీ నేతల సందర్శన

Podili: పొదిలి పొగాకు కేంద్రంలో వైసీపీ నేతల సందర్శన

hmtv 1 week ago

Podili: పొదిలి పట్టణంలోని పొగాకు వేలం కేంద్రాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం సందర్శించింది. ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో ఈ పర్యటన జరిగింది.

వేలం కేంద్రంలో జరిగిన పొగాకు వేలాల్లో పాల్గొన్న నేతలు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, భారీగా పొగాకు బేళ్లు కొనుగోలు కాకుండా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి… వేలానికి వచ్చిన పొగాకు బేళ్లలో దాదాపు అరవై శాతం వరకు కొనుగోలు జరగలేదని తెలిపారు. రైతులకు సరైన ధరలు దక్కక తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని అన్నారు.

గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి వేలం కేంద్రానికి వచ్చి రైతులను పరామర్శించిన సందర్భంలో కేసులు నమోదు చేశారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని ఆరోపించారు.

పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే మార్క్‌ఫెడ్‌కు ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులకు గిట్టుబాటు ధరలు లభించాయని, ప్రస్తుతం రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పొగాకు రైతులను ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పొదిలి, కొనకనమిట్ల మండలాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu