పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లాను బాలల సమస్యలు లేని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డా.
శ్రీనివాసమూర్తి, వెంకట పద్మలత పిలుపునిచ్చారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని పీజీఆర్‌ఎస్ హాలు లో ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల హక్కుల పరిరక్షణపై ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం 18 ఏళ్ల లోపు చిన్నారుల విద్యా, వైద్యం కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన జీవించే, అభివృద్ధి చెందే, రక్షణ పొందే, భాగస్వామ్యపు హక్కులను ప్రతి బిడ్డకూ అందేలా చూడాలన్నారు. ఉమ్మడి అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లో బాల్య వివాహాల నమోదు ఎక్కువగా ఉందని, వీటిని అరికట్టేందుకు జీవో నెం. 39 ప్రకారం నియమితులైన నిరోధక అధికారులు పటిష్టంగా పని చేయాలన్నారు.
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలతో స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలి. వారి విద్యా, ఆరోగ్యం, వ్యక్తిగత భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు సెల్‌ఫోన్లు, బైకులు, మత్తుపదార్థాలకు దూరంగా ఉండేలా చూడాలి. ప్రతి హాస్టల్‌లో బాలల హెల్ప్‌లైన్ నంబర్ 1098, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వివరాలను ప్రదర్శించాలి. విద్యార్థుల కోసం సలహా/ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయాలి.
జిల్లాలో 14 ఏళ్ల లోపు బాలకార్మికులు లేకుండా గుర్తించి, బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించాలి. బాలల చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. విద్యా, సంక్షేమ, ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక చొరవతో సమన్వయం చేసుకొని పనిచేయాలి. మీడియాలో వచ్చే బాలల సమస్యల కథనాలపై తక్షణమే స్పందించి వాస్తవాలను కలెక్టర్, కమిషన్ దృష్టికి తీసుకురావాలి. ఈ కార్యక్రమం లో డిఆర్ఓ కొండయ్య, సిడబ్ల్యుసి చైర్మన్ రామలక్ష్మి, ఐసిడిఎస్ పీడీ ప్రమీల, జిల్లా బాలల పరిరక్షణ అధికారి మహేష్, సంక్షేమ శాఖ అధికారులూ పాల్గొన్నారు.

