Rajahmundry: రాజమండ్రిలో కల్వర్టు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
రాజమండ్రి: ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన నగర నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రాబోయే గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరాన్ని మరింత సుందరంగా, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) తెలిపారు.
నగర అభివృద్ధిలో భాగంగా 10వ డివిజన్ విఎల్ పురం వినాయకుడి ఆలయం వద్ద రూ.7.85 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆర్‌సీసీ కల్వర్టు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
వి ఎల్ పురం జంక్షన్ వద్ద ఉన్న కల్వర్టు చిన్నదిగా ఉండటంతో మోడల్ కాలనీ, ఆల్ బ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల విజ్ఞప్తి మేరకు సమస్యను పరిశీలించి, పాత కల్వర్టును విస్తరించి బలమైన ఆర్‌సీసీ కల్వర్టుగా నిర్మిస్తున్నామని చెప్పారు.
ఈ పనులు పూర్తయిన తర్వాత ట్రాఫిక్ సౌకర్యం మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో నీటి ప్రవాహానికి కూడా ఎలాంటి ఆటంకం ఉండదని వివరించారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైన్లు, పార్కుల అభివృద్ధి, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ప్రజలకు అవసరమైన ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాజమహేంద్రవరం నగరంలో రూ.300 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇటీవల మరో రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని, అదనంగా డ్రైనేజ్ వ్యవస్థ సమగ్ర ప్రక్షాళన కోసం రూ.140 కోట్ల పనులకు కూడా టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.
మొత్తంగా రూ.240 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభ దశలో ఉన్నాయని వివరించారు. రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరిన్ని నిధులు మంజూరు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక వసతులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి రాజమహేంద్రవరాన్ని పరిశుభ్రమైన, సుందరమైన, ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు వాసిరెడ్డి బాబీ, చొప్పేర్ల భద్రరావు, ఖాన్ భాయ్, కంటిపూడి రాజేంద్రప్రసాద్, అప్పారావు, నగర పాలక సంస్థ తదితరులు పాల్గొన్నారు.

