Rampachodavaram: వైఎస్ జగన్ వ్యాఖ్యలకు రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే కౌంటర్: వైఎస్ జగన్ వ్యాఖ్యలకు రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే కౌంటర్
రంపచోడవరం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిపై చేసిన వ్యాఖ్యలను రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు.
మావిగన్ పేరుతో ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు.
ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను అయోమయంలోకి నెట్టిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ కొత్త పేర్లతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆరోపించారు.
వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి, ఎన్నో త్యాగాలు చేసి నిర్మాణానికి మార్గం సుగమం చేసిన అమరావతిని రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శించడం బాధ్యతారాహిత్యమని అన్నారు.
అమరావతి కేవలం ఒక ప్రాంతానికి చెందిన రాజధాని కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన రాజధానిగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదనను రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ప్రజాస్వామ్య పద్ధతిలో తిరస్కరించారని, అయినప్పటికీ కొత్త పేర్లతో అదే భావజాలాన్ని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమని విమర్శించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రాజధానిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
అమరావతే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా మరింత వైభవంగా రూపుదిద్దుకుంటుందని, ప్రజలు వాస్తవాలను గుర్తించి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సీతంశెట్టి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు

