Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rape Accused: అత్యాచార నిందితుడికి పూలదండలతో స్వాగతం, ఊరేగింపు!

Rape Accused: అత్యాచార నిందితుడికి పూలదండలతో స్వాగతం, ఊరేగింపు!

hmtv 4 days ago

Rape Accused: అత్యాచార నిందితుడికి పూలదండలతో స్వాగతం, ఊరేగింపు!

Ghaziabad: సమాజం ఎటు పోతోంది? విలువలు ఎటు వెళ్తున్నాయి? అత్యాచారం లాంటి అత్యంత ఘోరమైన, అమానుషమైన నేరానికి పాల్పడి, జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఒక నిందితుడికి పూలదండలతో, ఊరేగింపులతో వీరస్వాగతం పలకడం చూస్తే ఎవరికైనా రక్తం మరగడం ఖాయం.

సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ దారుణమైన ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, నెటిజన్ల నుంచి ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నేరస్థులను కీర్తించే ఇటువంటి వికృత చేష్టలు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

అసలు ఏం జరిగిందంటే..

హిందూ యువ వాహిని మాజీ సభ్యుడైన సుశీల్ ప్రజాపతి అనే వ్యక్తి, ఒక లా చదువుతున్న విద్యార్థినిని దారుణంగా మోసం చేశాడు. ఆమెకు ఒక మంచి న్యాయవాదిని పరిచయం చేస్తానని నమ్మబలికి, తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, సుశీల్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. దాదాపు 9 నెలల పాటు జైలు ఊచలు లెక్కబెట్టిన ఈ నిందితుడికి ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

జైలు నుంచి రాగానే వీరస్వాగతం..

మే 17వ తేదీన సుశీల్ ప్రజాపతి జైలు గేటు దాటి బయటకు రాగానే, అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి స్థానికులు షాకయ్యారు. అతని అనుచరులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. ఏదో దేశాన్ని రక్షించి సరిహద్దుల నుండి తిరిగి వచ్చిన వీరుడిలా అతనికి స్వాగతం పలికారు. నిందితుడి మెడలో పూలదండలు వేసి, కరచాలనాలు చేస్తూ, కొందరైతే ఏకంగా అతని కాళ్లకు మొక్కుతూ నానా హడావిడి చేశారు. అంతటితో ఆగకుండా, ఆ అత్యాచార నిందితుడిని భుజాలపై మోస్తూ, నినాదాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఒక మహిళపై అమానుషానికి ఒడిగట్టి, బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తిని ఇంతలా కీర్తించడంపై సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

రంగంలోకి పోలీసులు

ఇలాంటి వికృత వేడుకలు, ఊరేగింపులు నేరానికి గురైన బాధితురాలిని మరింత మానసిక క్షోభకు, ఆవేదనకు గురిచేయడమేనని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘోరమైన ఊరేగింపుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు ఎట్టకేలకు రంగంలోకి దిగారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, సమాజంలో తప్పుడు సంకేతాలు పంపడం ,నిందితుడిని బహిరంగంగా కీర్తించడం వంటి అంశాలపై పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu