Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rayadurgam: రాయదుర్గం ప్రజలకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కీలక పిలుపు

Rayadurgam: రాయదుర్గం ప్రజలకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కీలక పిలుపు

hmtv 1 week ago

Rayadurgam: రాయదుర్గం ప్రజలకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కీలక పిలుపు

రాయదుర్గం: పట్టణాన్ని స్వచ్ఛతకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలంటే ప్రతి పౌరుడు పారిశుద్ధ్య కార్మికుడిగా బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

రాయదుర్గం పట్టణంలో శనివారం నిర్వహించిన "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర" కార్యక్రమాన్ని పాత మున్సిపాలిటీ వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజును ప్రత్యేక పారిశుధ్య దినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాయదుర్గం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 400 మంది పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. అయితే కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే పని చేస్తే సరిపోదని, ప్రతి ఒక్కరూ తమ ఒంటిని, ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటారో అదే విధంగా తమ పరిసరాలు, వీధులు, కాలనీలను కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు పారిశుద్ధ్య కార్మికుడిగా బాధ్యత తీసుకున్నప్పుడే అందమైన, స్వచ్ఛమైన రాయదుర్గం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ప్లాస్టిక్ రహిత రాయదుర్గం లక్ష్యంగా మున్సిపాలిటీ నిరంతరాయంగా పని చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన లక్ష టన్నుల చెత్తలో ఇప్పటికే 30 వేల టన్నులు తొలగించామని, మిగిలిన 70 వేల టన్నుల చెత్తను కూడా నెలన్నర రోజుల్లో పూర్తిగా శుభ్రం చేసేందుకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వివరించారు. పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం దాదాపు రూ.57 లక్షలు వెచ్చించామని, ఇందులో భాగంగా చెత్త సేకరణ బండ్ల సంఖ్య పెంచడం, కొత్తగా రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేయడం, పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన పనిముట్లు అందించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాయదుర్గం ప్రాంతంపై ఉన్న ప్రత్యేక అభిమానంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు అవుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఇతర పట్టణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రాయదుర్గాన్ని అందమైన, సుందరమైన, స్వచ్ఛమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu