Razole: రెండు చేతులు లేవు.. పింఛను రాదు.. బాధితుడి ఆర్తనాదం!
రాజోలు: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం బి.సావరం గ్రామానికి చెందిన అచంట కృష్ణమూర్తి (40) కి రెండు చేతులు లేకపోవడంతో ఎన్నిసార్లు పింఛన్ కి దరఖాస్తు చేసుకున్న అధికారులు స్పందించడం లేదని కన్నీటి పర్యంతం అవుతున్నాడు.
1999 లో జరిగిన ఒక రైలు ప్రమాదంలో తన రెండు చేతులు పోయాయని,వేరొకరి సాయం లేకుంటే తను జీవించటం కష్టం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే తన చేతులు పోయాక 2012 వరకు వికలాంగుల పింఛను ఇచ్చారని,తదుపరి ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కోవడంతో తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, దాంతో తన పింఛను, రేషన్ కార్డు తీసివేసినట్లు తెలిసిందని తెలిపాడు.
అయితే 2014 లో తాను అత్యున్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకోగా.. తనను కావాలనే ఆ కేసులో ఇరికించారని,తనపై నిరూపితమైన శిక్ష రద్దు చేస్తు ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందన్నాడు.అయితే 2014 నుండి తనకు పింఛను ఇప్పించవలసిందిగా ఎన్నిసార్లు సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లిన ఎవరు స్పందించలేదని వాపోతున్నాడు.తనకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారని..కొడుకుగా వారి ఆలనా పాలనా చూడాల్సిన నేను వారికి భారంగా మారానని అసహనం వ్యక్తం చేశాడు.
ఇటీవలె తనకు తోడుగా ఉంటుందని ఒక అమ్మాయితో వివాహం చేసారని,ఆమెను తల్లిదండ్రులను ఎలా పోషించాలో అర్థం కావడంలేదు అంటు విచారం వ్యక్తం చేస్తున్నాడు. ఇదే విషయమై గతేడాది జిల్లా కలెక్టర్ వారిని కలిసి నామొర వినిపించానని అయినా ఏవిధమైన ప్రయోజనం లేదంటున్నాడు.ఇదే విషయమై మరలా రెండు రోజుల క్రితం గ్రీవెన్స్ నందు కలెక్టర్ ని కలిసేందుకు వెళ్లగా గ్రీవెన్స్ అధికారులు కలవనివ్వలేదని వాపోతున్నాడు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి నాకు పింఛన్ ఇప్పించి, నాకు,నా కుటుంబానికి అండగా, చేదోడుగా ఉండాలని వేడుకుంటున్నాడు.

