Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RCB vs GT Final 2026: హార్దిక్‌ పాండ్య సెంటిమెంట్.. ఆర్సీబీకి షాక్, గుజరాత్ టైటాన్స్‌దే టైటిల్?

RCB vs GT Final 2026: హార్దిక్‌ పాండ్య సెంటిమెంట్.. ఆర్సీబీకి షాక్, గుజరాత్ టైటాన్స్‌దే టైటిల్?

hmtv 2 weeks ago

RCB vs GT Final 2026: హార్దిక్‌ పాండ్య సెంటిమెంట్.. ఆర్సీబీకి షాక్, గుజరాత్ టైటాన్స్‌దే టైటిల్?

RCB vs GT Final 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది.

ఆదివారం (మే 31) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టైటిల్ కోసం జరిగే మహా సమరంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) తలపడనున్నాయి. రెండు జట్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండడంతో.. మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఫైనల్‌ మ్యాచ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్ వైరల్‌గా మారింది. అదే గుజరాత్ టైటాన్స్ మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్య సెంటిమెంట్. గత మూడు సీజన్లుగా ఈ సెంటిమెంట్ అచ్చుగుద్దినట్టు నిజమవుతుండటంతో.. ఈసారి కూడా గుజరాత్ టైటాన్స్‌కే టైటిల్ దక్కుతుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఏంటీ హార్దిక్ పాండ్య సెంటిమెంట్?:

ప్రతి ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి పదిహేను రోజుల ముందు.. అన్ని జట్ల కెప్టెన్లతో ఫొటోషూట్ నిర్వహించడం ఆనవాయితీ. ట్రోఫీతో పాటు పది జట్ల సారథులు పాల్గొనే ఈ ఫొటోను ఐపీఎల్ యాజమాన్యం అధికారిక పోస్టర్‌గా విడుదల చేస్తుంది. 2022లో హార్దిక్‌ పాండ్య సారథిగా జీటీకి టైటిల్ అందించాడు. అయితే 2023 నుంచి ఓ ఆసక్తికరమైన యాదృచ్ఛికం చోటుచేసుకుంటోంది. కెప్టెన్ల పోస్టర్‌లో హార్దిక్ పక్కన నిలబడిన కెప్టెన్ జట్టు ఆ సీజన్‌లో టైటిల్ గెలుస్తోంది. వరుసగా మూడు సీజన్లుగా ఈ సెంటిమెంట్ నిజమవడంతో ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం 2026 పోస్టర్‌పై పడింది.

2023లో ధోనీ.. సీఎస్‌కేకు టైటిల్:

ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు విడుదలైన కెప్టెన్ల పోస్టర్‌లో హార్దిక్ పాండ్య పక్కన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిలబడ్డాడు. ఆ సీజన్‌లో సీఎస్‌కే ఫైనల్ చేరి.. గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక్కడ విశేషమేమిటంటే.. హార్దిక్ సారథ్యంలోని గుజరాత్‌కే ధోనీ సేన షాక్ ఇచ్చింది.

2024లో శ్రేయస్ అయ్యర్.. కేకేఆర్‌కు కప్పు:

ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు విడుదలైన కెప్టెన్స్ పోస్టర్‌లో హార్దిక్ పాండ్య పక్కన కోల్‌కతా నైట్‌ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. ఆ ఏడాది కేకేఆర్ అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌లో విజయం సాధించింది. దాదాపు పదేళ్ల తర్వాత మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ఎత్తుకుంది. దీంతో హార్దిక్ సెంటిమెంట్ మరోసారి నిజమైంది.

2025లో రజత్ పాటిదార్.. ఆర్సీబీకి తొలి టైటిల్:

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఈ సెంటిమెంట్ మరింత బలపడింది. కెప్టెన్ల ఫొటోలో హార్దిక్ పాండ్య పక్కన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ నిలబడ్డాడు. ఆ సీజన్‌లో ఆర్సీబీ చరిత్ర సృష్టిస్తూ.. తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి అభిమానుల 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది.

ఈసారి హార్దిక్ పక్కన శుభ్‌మన్ గిల్.. టైటిల్ జీటీదేనా?:

ఇక ఐపీఎల్ 2026 అధికారిక పోస్టర్‌లో హార్దిక్ పాండ్య పక్కన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరుకోవడంతో.. హార్దిక్ సెంటిమెంట్ ప్రకారం ఈసారి టైటిల్ కూడా జీటీకే దక్కుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

యాదృచ్ఛిక సెంటిమెంట్లే అయినా:

అయితే ఇవన్నీ కేవలం యాదృచ్ఛిక సెంటిమెంట్లే. ఫైనల్‌లో ఎవరు మెరుగైన ప్రదర్శన చేస్తారో వారే ఛాంపియన్లుగా నిలుస్తారు. అయినప్పటికీ గత మూడు సీజన్ల చరిత్రను చూసిన అభిమానులు మాత్రం ఈ సెంటిమెంట్‌ను తేలికగా తీసుకోవడం లేదు. మరి హార్దిక్ పాండ్య సెంటిమెంట్ మరోసారి నిజమవుతుందా? లేక ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందా? అన్నది ఆదివారం రాత్రి తేలనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu