Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేప్ నిందితుడి జరిమానా డబ్బులతో పంచాయతీ పెద్దల మందు పార్టీ!

రేప్ నిందితుడి జరిమానా డబ్బులతో పంచాయతీ పెద్దల మందు పార్టీ!

hmtv 16 hrs ago

రేప్ నిందితుడి జరిమానా డబ్బులతో పంచాయతీ పెద్దల మందు పార్టీ!

ఝార్ఖండ్ రాష్ట్రంలో విస్తుపోయేలా చేసే అత్యంత అమానవీయ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

మూడేళ్ల పసికందుపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి రక్షణ కల్పించడమే కాకుండా, అతనికి విధించిన జరిమానా డబ్బులతో గ్రామ పంచాయతీ పెద్దలు మందు, మాంసంతో విందు చేసుకోవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ దారుణ ఉదంతంపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడితో పాటు పంచాయతీ పెద్దలను కూడా అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా, పాల్మా గ్రామానికి చెందిన సునీల్ లోహ్రా అనే వ్యక్తి శనివారం సాయంత్రం స్థానికంగా ఉండే ఒక మూడేళ్ల చిన్నారి ఇంటికి వెళ్లాడు. పాపను ఆడిస్తానని చెప్పి నమ్మించి, పక్కనే ఉన్న మరో గదిలోకి తీసుకువెళ్లి ఆ పసికందుపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. పాప ఏడుపు విని గదిలోకి వెళ్లిన తల్లికి, రక్తస్రావంతో ఉన్న చిన్నారిని చూసి గుండె పగిలినంత పనైంది.

బాధిత తల్లి న్యాయం కోసం వెంటనే గ్రామ పెద్దలను ఆశ్రయించింది. అయితే, ఈ ఘోర నేరం గురించి పోలీసులకు సమాచారం తెలియకుండా దాచాలని గ్రామ పెద్దలు నిర్ణయించుకున్నారు. చట్టాన్ని పక్కనబెట్టి చిన్నారిని రహస్యంగా ఓ ప్రైవేట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించారు.

అనంతరం ఈ వ్యవహారంపై గ్రామంలోనే పంచాయతీ తీర్పునిచ్చారు. నిందితుడు సునీల్ లోహ్రాకు రూ. 1 లక్ష జరిమానా (ఫైన్) విధించారు. అందులో తక్షణమే రూ. 20,000 చెల్లించాలని, మిగిలిన రూ. 80,000 వారం రోజుల్లోగా ఇవ్వాలని హుకుం జారీ చేశారు.

నిందితుడు తక్షణమే చెల్లించిన రూ. 20,000 నగదును తీసుకున్న పంచాయతీ పెద్దలు.. ఆదివారం రాత్రి ఆ డబ్బులతో మాంసం, మద్యంతో ఘనంగా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అత్యంత హేయమైన విషయం ఏంటంటే, ఆ పార్టీలో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సునీల్ లోహ్రా కూడా వారితో కలిసి కూర్చుని మందు తాగాడు.

ఈ దారుణ ఉదంతాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వెంటనే పోలీసులకు రహస్యంగా సమాచారం అందించాడు. దీంతో పోలీసులు రాత్రికి రాత్రే దావత్ చేసుకుంటున్న స్పాట్‌పై దాడి చేసి, నిందితుడితో పాటు పంచాయతీ పెద్దలందరినీ బేడీలు వేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితురాలి తల్లి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నిందితులందరిపై కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu