Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sanju Samson-CSK: కొత్త ఇంటికి వెళ్లి డిమాండ్లు చేయలేం.. కెప్టెన్సీపై సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Sanju Samson-CSK: కొత్త ఇంటికి వెళ్లి డిమాండ్లు చేయలేం.. కెప్టెన్సీపై సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

hmtv 1 week ago

Sanju Samson-CSK: కొత్త ఇంటికి వెళ్లి డిమాండ్లు చేయలేం.. కెప్టెన్సీపై సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Sanju Samson-CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) తరఫున టీమిండియా స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన భారీ ట్రేడ్ డీల్ ద్వారా సీఎస్‌కేలో చేరిన సంజు.. ఈ సీజన్‌లో ఇప్పటికే 10 మ్యాచ్‌ల్లో 400కి పైగా పరుగులు చేసి జట్టును ప్లేఆఫ్స్ రేసులో నిలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌పై సెంచరీలు బాదిన సంజూ.. ఇటీవల ఢిల్లీపై అజేయంగా 87 పరుగులు చేసి మరోసారి తన క్లాస్ చూపించాడు. తాజాగా సీఎస్‌కే కెప్టెన్సీ అంశంపై సంజు తొలిసారి స్పందించాడు.

ఈ ఏడాది సంజు శాంసన్ సీఎస్‌కేలో చేరినప్పటి నుంచి రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో అతడే కెప్టెన్ అవుతాడనే ప్రచారం సాగింది. ఈ ప్రచారానికి ఆజ్యం పోసింది మన మాజీలు, వ్యాఖ్యతలే. మాజీ స్పిన్నర్ ఆర్‌ ఆశ్విన్‌ కూడా సంజు తప్పకుండా కెప్టెన్సీ చేపట్టే అవకాశాలున్నాయని అనడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకొంది. అయితే తాజాగా సీఎస్‌కే పోడ్కాస్ట్‌లో మాట్లాడిన సంజు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. సీఎస్‌కే కెప్టెన్సీ గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని స్పష్టం చేశాడు. ప్రోమో వీడియోలో అభినవ్‌ ముకుంద్‌తో మాట్లాడుతూ.. కొత్త ఇంటికి వెళ్లి డిమాండ్లు చేయలేం అని సరదాగా అన్నాడు.

'లేదు లేదు.. సీఎస్‌కే కెప్టెన్ అవుదామనే ఆలోచనే నాకు రాలేదు. నేను మొన్నటివరకు ఒక జట్టులో (రాజస్థాన్ రాయల్స్) ఉన్నాను. అక్కడి నుంచి కొత్త జట్టుకు (సీఎస్‌కే) వచ్చాను. అలాంటి సమయంలో డిమాండ్లు చేయలేం. నిజాయితీగా చెప్పాలంటే.. మీరు ఒక కొత్త ఇంటికి వెళ్లి షరతులు పెట్టలేరు. ముందుగా మీ విలువను నిరూపించుకోవాలి' అని సంజు శాంసన్ చెప్పాడు. తన మలయాళీ నేపథ్యం కూడా తన ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసిందని పేర్కొన్నాడు. 'చెన్నైలో, దుబాయ్‌లో చాలా మంది మలయాళీలు పనిచేస్తుంటారు. వాళ్లను యజమానులు ఎందుకు ఇష్టపడతారంటే.. తమపై నమ్మకం ఉంచిన వారికి ప్రాణం పెట్టి పనిచేస్తారు. సీఎస్‌కే నన్ను నమ్మి ఇక్కడికి తీసుకొచ్చింది. నేను నా శక్తిమేరకు జట్టుకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను' అని సంజు తెలిపాడు.

ఇక సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై కూడా సంజు శాంసన్ ప్రశంసలు కురిపించాడు. రుతురాజ్ చాలా ప్రశాంతంగా కనిపించినా.. భారత క్రికెట్‌లో అత్యంత ఆత్మవిశ్వాసం ఉన్న ఆటగాళ్లలో అతడు ఒకడని అన్నాడు. 'రుతురాజ్ గైక్వాడ్‌ చాలా భిన్నమైన వ్యక్తి. అతడు సూపర్ స్టార్ అయినా అలాంటి ప్రవర్తన కనిపించదు. ఒక పెద్ద ఫ్రాంచైజీకి నాయకత్వం వహిస్తున్నాడు. నేను మరో జట్టుకు ఐదేళ్లు కెప్టెన్‌గా ఉన్నాను. అయినా నన్ను తన జట్టులోకి ఆహ్వానించాడు. అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే అతడికి తనపై ఎంత నమ్మకం ఉండాలో అర్థం చేసుకోవచ్చు' అని సంజూ పేర్కొన్నాడు.

అంతేకాదు తాను సీఎస్‌కేకు రావడానికి ప్రధాన కారణం కూడా రుతురాజ్ గైక్వాడ్ అని సంజు శాంసన్ వెల్లడించాడు. అతడే ముందుగా సంప్రదించి జట్టులోకి రావాలని కోరాడని తెలిపాడు. ప్రస్తుతం సంజు ఫామ్‌, రుతురాజ్ నాయకత్వం కలిసి సీఎస్‌కేను ప్లేఆఫ్స్ దిశగా తీసుకెళ్తుండటంతో అభిమానుల్లో భారీ ఆశలు నెలకొన్నాయి. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ)తో చెన్నై తలపడనుంది. ఈ మ్యాచులో గెలిస్తే.. ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సులువు అవుతాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu