Secunderabad: పార్సిగుట్టలో దారుణం.. వ్యక్తి అనుమానాస్పద మృతి!
Secunderabad: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వారసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగుచూసింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్సిగుట్ట సంజీవపురంలోని సంతోష్‌నగర్‌కు చెందిన జాల్డా కిషోర్ (40) అనే వ్యక్తికి కొంతకాలంగా భార్యతో వివాదాలు నడుస్తున్నాయి. ఈ మనస్తాపంతో అతను గత పది రోజులుగా తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిపై అంతస్తులో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఈ నెల 21వ తేదీ రాత్రి కిషోర్‌ను కుటుంబ సభ్యులు చివరిసారిగా చూశారు.
ఆదివారం ఉదయం కిషోర్ గది వెలుపల రక్తం చింది ఉండటాన్ని గమనించిన పనిమనిషి, వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వారు పైకి వెళ్లి చూడగా లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులు పగులగొట్టి ప్రవేశించారు. గదిలో కిషోర్ మగతావస్థలో మృతి చెంది ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. ఉదయం 6:45 గంటల ప్రాంతంలో డయల్-100 ద్వారా సమాచారం అందుకున్న వారసిగూడ ఎస్‌ఐ, పెట్రోలింగ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఘటనా స్థలంలో ఎలాంటి ఘర్షణ జరిగిన ఆనవాళ్లు లేవని, కిషోర్ మరణించి 24 గంటలకు పైగా సమయం అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మరణానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

