Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Simhachalam: భూ హక్కుల కోసం సీపీఎం పాదయాత్ర

Simhachalam: భూ హక్కుల కోసం సీపీఎం పాదయాత్ర

hmtv 2 weeks ago

Simhachalam: భూ హక్కుల కోసం సీపీఎం పాదయాత్ర

Simhachalam: సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను ఇకపై వాయిదా వేయడం, ప్రజలను హామీలతో మభ్యపెట్టడం సహించబోమని సిపిఎం ప్రభుత్వానికి తుదిహెచ్చరిక జారీ చేసింది.

భూ హక్కుల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్ర నాలుగో రోజు బుధవారం వేపగుంట ప్రశాంతినగర్, విద్యానగర్, గౌతమ్ నగర్ ప్రాంతాల్లో ఉధృతంగా సాగింది.

కాలనీల్లోకి అడుగుపెట్టిన సిపిఎం నాయకత్వానికి ప్రజలు భారీగా తరలివచ్చి మద్దతు తెలపగా, భూ సమస్యపై ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇక హామీలు వద్దు… మాకు జి.ఓ కావాలి", "మాకు పట్టాలు కావాలి" అంటూ ప్రజలు నినాదాలతో మారుమోగించారు.

ఈ సందర్భంగా పాదయాత్రలో మాట్లాడిన సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి జగన్, జిల్లా కమిటీ సభ్యులు బి వెంకటరావు, సీనియర్ నాయకులు పి వెంకట్ రెడ్డి శాస్త్రి పంచగ్రామాల ప్రజలతో గత 30 ఏళ్లుగా ప్రభుత్వాలు దారుణంగా ఆటలాడుతున్నాయని మండిపడ్డారు.

తలుపుతట్టని కార్యాలయం లేదని, కలవని ప్రజాప్రతినిధి లేడని, చేయని విన్నపం లేదని, చేయని ఆందోళన లేదని, అయినా నేటికీ శాశ్వత పరిష్కారం చూపకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. ఇది సాధారణ భూ వివాదం కాదని, వేలాది కుటుంబాల జీవన్మరణ సమస్య అని స్పష్టం చేశారు.

1996-97లో ఎలాంటి చట్టబద్ధ ఆధారాలు లేకుండానే వేల ఎకరాలను సింహాచలం దేవస్థానం పేరుతో రైత్వారీ పట్టాలుగా నమోదు చేయించి ఈ సమస్యకు మూలం వేసింది అప్పటి టిడిపి ప్రభుత్వమేనని నాయకులు విమర్శించారు. అనంతరం జి.ఓ నెం.578 తెచ్చి దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలను ఆక్రమణదారులుగా ముద్రవేయడం ఘోర అన్యాయమన్నారు.

ఇళ్లను కట్టుకోవడానికి అనుమతిచ్చింది ప్రభుత్వమే, కరెంటు-నీటి సౌకర్యాలు కల్పించింది ప్రభుత్వమే, పన్నులు వసూలు చేసింది ప్రభుత్వమే, ఓటర్లుగా గుర్తించింది ప్రభుత్వమే; ఇప్పుడు అదే ప్రభుత్వం ప్రజలను ఆక్రమణదారులని ముద్ర వేయడం దివాళా పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.

2017 స్టేటస్ కో పేరుతో పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు, నిర్మాణాలు, మరమ్మతులు అన్నీ నిలిపివేసి ప్రజలను తమ ఇళ్లలోనే బందీలుగా మార్చారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కార్పొరేట్ కంపెనీలకు భూముల కేటాయింపులో, ధనికుల నిర్మాణాల్లో మాత్రం ఎలాంటి స్టేటస్ కో ఉండదని విమర్శించారు.

పేదలకు కఠిన నిబంధనలు, కార్పొరేటర్స్ కు ఫాస్ట్ ట్రాక్ అనుమతులు ఇవ్వడం ప్రభుత్వ వర్గపక్షపాతాన్ని బయటపెడుతోందన్నారు. 1903 గిల్మన్ సర్వే రికార్డుల ప్రకారం సింహాచలం దేవస్థానానికి కేవలం 39.5 ఎకరాలే ఉన్నాయని, మరి వేల ఎకరాలపై దేవస్థానం హక్కు ఎలా వచ్చిందో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇకపై హామీలు, కమిటీలు, మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని సిపిఎం నాయకులు స్పష్టం చేశారు. సింహాచలం దేవస్థానానికి ఇచ్చిన రైత్వారీ పట్టాలను వెంటనే రద్దు చేయాలని, 1903 గిల్మన్ సర్వే రికార్డులు మరియు ప్రజల నివాస ఆధారాల ప్రకారం పంచగ్రామాల ప్రజలను హక్కుదారులుగా గుర్తిస్తూ స్పష్టమైన జి.ఓ జారీ చేయాలని, ఇళ్ల రిజిస్ట్రేషన్లు-క్రయవిక్రయాలు-నిర్మాణాలు-మరమ్మతులపై ఉన్న ఆంక్షలన్నీ తొలగించాలని, దేవస్థానం పేరుతో జరుగుతున్న బెదిరింపులు పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ప్రశాంతినగర్, విద్యానగర్, గౌతమ్‌నగర్ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగిన సిపిఎం నాయకత్వానికి మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో మద్దతుగా నిలిచి "ఇక మౌనం కాదు - ఉద్యమమే మార్గం", "ప్రజ గర్జనతో జి.ఓ సాధిద్దాం" అంటూ నినాదాలు చేశారు. పంచగ్రామాల ప్రజలు ఐక్యంగా పోరాడితేనే ప్రభుత్వం దిగివస్తుందని, భూ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించే వరకు పాదయాత్రతో పాటు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని సిపిఎం నాయకులు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్ నాయకులు వి.ప్రభావతి, కే అప్పలనాయుడు ఎన్ ప్రభుదేవా ఈశ్వర్ రావు మహేష్ రాజు లక్ష్మి మహాలక్ష్మి పంచగ్రామాల భూ సమస్య కాలనీ నాయకులు, మహిళలు, యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu