Simhachalam: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్యక్షేత్రం సింహాచలంలో భక్తులకు మరొక మహద్భాగ్యం లభించనుంది.
భక్తుల చిరకాల కోరిక మేరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించే విశిష్టమైన 'స్వర్ణపుష్పార్చన' సేవను ఈ నెల 23వ తేదీ నుండి ప్రతి శని, ఆదివారాల్లో తిరిగి ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం ప్రతి శనివారం, ఆదివారం రోజుల్లో ఈ సేవను మూడు విడతలుగా నిర్వహించనున్నారు.
మొదటి బ్యాచ్: ఉదయం 07:30 గంటలకు
రెండవ బ్యాచ్: ఉదయం 09:00 గంటలకు
మూడవ బ్యాచ్: ఉదయం 10:30 గంటలకు
అంతరాలయ ప్రవేశంతో విశిష్ట అవకాశం
ఈ సేవలో పాల్గొనే భక్తులకు స్వామి వారి అంతరాలయంలోకి ప్రవేశం కల్పించబడుతుంది. భక్తులు స్వయంగా స్వర్ణ పుష్పాలను స్పృశిస్తూ, స్వామివారి పాదాల చెంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకునే అరుదైన అవకాశం ఈ సేవ ద్వారా లభించనుంది.
గర్భాలయం మరియు భోగ మండపంలో అత్యంత వైభవంగా జరిగే ఈ సేవలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతి బ్యాచ్‌కు కేవలం 30 నుండి 50 మంది దంపతులకు మాత్రమే అవకాశం కల్పించబడుతుంది.
భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక సాంకేతిక సదుపాయాల ద్వారా టికెట్లను పొందేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులు క్రింది విధానాల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు:
* AP Temples Official అధికారిక వెబ్‌సైట్ ద్వారా
* 'మనమిత్ర' వాట్సాప్ సేవ ద్వారా
* ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా
ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ.. "భక్తుల అభిలాష మేరకు సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరిగే ఈ మహత్తరమైన 'స్వర్ణపుష్పార్చన' సేవను తిరిగి ప్రారంభిస్తున్నాము. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము" అని తెలిపారు.

