Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన అరుదైన మానవతా ఘటన!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన అరుదైన మానవతా ఘటన!

hmtv 1 hr ago

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన అరుదైన మానవతా ఘటన!

Sircilla: మానవత్వం మరుగున పడుతున్న నేటి రోజుల్లో ఓ సామాన్య హమాలి కార్మికుడు తన నిస్వార్థ సేవతో రియల్ హీరోగా నిలిచారు.

ఆపదలో ఉన్న ఓ బస్సు డ్రైవర్ ప్రాణాలను సమయస్ఫూర్తితో కాపాడి.. ఆయన కోలుకునే వరకు అండగా నిలిచారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన అందే సామ్యూల్.

రెండు వారాల క్రితం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో బస్సు డ్రైవర్ చక్రపాణికి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి కిందపడిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సామ్యూల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు చక్రపాణిని ఆసుపత్రికి తరలించారు. వైద్యం పూర్తయ్యే వరకు ఆయనకు అండగా నిలిచారు.

అంతేకాకుండా చక్రపాణి పూర్తిగా కోలుకునే వరకు ప్రతి క్షణం ఆయన వెంటే ఉంటూ మానవత్వాన్ని చాటుకున్నారు.

రెండు వారాల తర్వాత కృతజ్ఞతలు

ప్రాణాపాయం నుంచి కోలుకున్న చక్రపాణి.. తన ప్రాణాలు కాపాడిన సామ్యూల్‌ను వెతుక్కుంటూ వచ్చారు. సామ్యూల్‌ను చూడగానే భావోద్వేగానికి గురైన చక్రపాణి కన్నీటి పర్యంతమవుతూ ఆయన పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

"ఆ రోజు సామ్యూల్ లేకపోతే నేను బతికేవాడిని కాదు.. ఆయన చూపిన చొరవే నా కుటుంబాన్ని నిలబెట్టింది" అంటూ చక్రపాణి భావోద్వేగానికి గురయ్యారు.

కష్టజీవి.. కానీ మనసు మాత్రం శ్రీమంతం

వృత్తిరీత్యా రోజువారీ హమాలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే సామ్యూల్.. చేతిలో రూపాయి లేకపోయినా ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేసేందుకు వెనుకాడలేదు. రోజూ బరువులు మోసే ఆయన చేతులు.. ఆ రోజు ఓ నిండు ప్రాణాన్ని, ఓ కుటుంబాన్ని నిలబెట్టాయి.

సాయం చేయడానికి ఆస్తిపాస్తులు అవసరం లేదని.. విశాలమైన హృదయం ఉంటే చాలని సామ్యూల్ తన సేవతో నిరూపించారు. కష్టపడి జీవించే ఓ సామాన్య శ్రామికుడు చూపిన ఈ మానవత్వం సమాజానికి ఆదర్శంగా నిలిచింది.

ఒక ప్రాణాన్ని కాపాడి.. ఓ కుటుంబాన్ని నిలబెట్టిన అందే సామ్యూల్‌కు పలువురు అభినందనలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu