Sircilla: రేపటి నుంచి తల్లిపాల వారోత్సవాలు సిరిసిల్ల డీఎంహెచ్‌వో
సిరిసిల్ల: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జి.
ఎంజేలా ఆల్ఫ్రెడ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శిశువు పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలని, మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. కాన్పు అనంతరం వచ్చే మొదటి చిక్కని, పసుపు రంగు ముర్రుపాలు (కొలస్ట్రం) శిశువుకు అమృతంతో సమానమని, వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే ప్రోటీన్లు, విటమిన్-ఎ, విటమిన్-బి, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు.
తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందించడంతో పాటు శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు, ఆస్తమా, చర్మవ్యాధులు, విరేచనాలు, కామెర్లు వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయని పేర్కొన్నారు. తల్లిపాలు త్రాగే పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఎదుగుతారని, మానసిక, శారీరక వికాసానికి కూడా ఎంతో దోహదపడతాయని వివరించారు.
ఆరు నెలలు పూర్తయ్యే వరకు తల్లిపాలు తప్ప నీరు, తేనె, పంచదార నీరు, ఆవుపాలు, మేకపాలు లేదా ఇతర ఆహార పదార్థాలు, సీసా పాలు ఇవ్వవద్దని సూచించారు. ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు వయస్సుకు అనుగుణంగా పై ఆహారం ప్రారంభించాలని తెలిపారు.
తల్లులు సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు బిడ్డకు సరైన పద్ధతిలో పాలివ్వాలని, బిడ్డ నోరు పూర్తిగా చనుమొనను పట్టేలా చూసుకోవాలని సూచించారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి శిశువుకు తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలనే అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

