Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sircilla: తల్లి పాలలోనే శిశువుకు పూర్తి పోషకాలు: కలెక్టర్ గరిమ అగ్రవాల్

Sircilla: తల్లి పాలలోనే శిశువుకు పూర్తి పోషకాలు: కలెక్టర్ గరిమ అగ్రవాల్

hmtv 1 week ago

Sircilla: తల్లి పాలలోనే శిశువుకు పూర్తి పోషకాలు: కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల: తల్లి పాలలోనే శిశువుకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిరిసిల్ల నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లి పాల ప్రాముఖ్యత, శిశువుకు పాలు ఇచ్చే విధానం, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారం, అపోహలు-వాస్తవాలపై నాటిక ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ బాలింతలకు పండ్లు పంపిణీ చేసి, తల్లి పాల వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు.

కలెక్టర్ మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే తల్లి వద్దకు చేర్చి పాలు ఇవ్వడం ప్రారంభించాలని సూచించారు. మొదటి ఆరు నెలల పాటు తల్లి పాలే ఇవ్వాలని, దీంతో శిశువు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు బాలింత ఆరోగ్యానికీ మేలు జరుగుతుందని చెప్పారు.

బాలింతలు వైద్యుల సూచన మేరకు పోషకాహారం, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని సూచించారు. శిశువుకు సరైన విధంగా తల్లిపాలు ఇవ్వడంపై ప్రతి బాలింతకు వైద్య సిబ్బంది శిక్షణ అందించాలని ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా తల్లి పాల వారోత్సవాలను ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని, ఆశా వర్కర్లు తమ పరిధిలోని బాలింతలను కలిసి తల్లి పాల ప్రాముఖ్యత, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణపై నిరంతరం అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ మహేష్ కుమార్, వార్డు కౌన్సిలర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu