Srikakulam: కన్నవారే కాటికి పంపారు.. కాపరి కాపాడాడు.. సోంపేటలో ఘోరం!
Srikakulam: వృద్ధాప్యంలో తల్లిని భారంగా భావించి ముళ్లపొదల్లో వదిలేసిన కన్నబిడ్డల దారుణం సోంపేట మండలం పాలవలస సమీపంలో వెలుగుచూసింది.
శ్రీకాకుళం పరిసర గ్రామానికి చెందిన మైలపిల్లి లక్ష్మి (60)ని ఇద్దరు కొడుకులు, కూతురు కలిసి 100 కిలోమీటర్ల దూరంలోని రైల్వే పట్టాల పక్క ముళ్లపొదల్లో వదిలేసి వెళ్లారు. 3 రోజులుగా అన్నపానీయాలు లేక అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మిని రట్టి గ్రామ గొర్రెల కాపరి పులారి ఆకాష్ గుర్తించాడు. వెంటనే "సీతయ్య ఫౌండేషన్"కు సమాచారం ఇవ్వగా, వ్యవస్థాపకులు గుళ్ల రమేష్, గుళ్ల మోహనరావు స్పందించారు. రహదారికి 2 కి.మీ దూరంలోని ముళ్లపొదల్లోకి వెళ్లి వృద్ధురాలిని రక్షించారు. సోంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించి, శుక్రవారం సీతయ్య ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించారు. సహాయం అందించిన పులారి ఆకాష్, సానా గణేష్, కిమ్మోజి డిల్లేశ్వరరావును పలువురు అభినందించారు.

