Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Strait of Hormuz Shipping: చమురు మార్కెట్లకు ఊరట... హోర్ముజ్‌ జలసంధిలో పరుగులు తీస్తున్న వాణిజ్యనౌకలు

Strait of Hormuz Shipping: చమురు మార్కెట్లకు ఊరట... హోర్ముజ్‌ జలసంధిలో పరుగులు తీస్తున్న వాణిజ్యనౌకలు

hmtv 2 weeks ago

Strait of Hormuz Shipping: అంతర్జాతీయ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి హోర్ముజ్ జలసంధిలో ఎట్టకేలకు వాణిజ్య నౌకల రాకపోకలు మళ్లీ గాడిన పడుతున్నాయి. గత వారాంతంలో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య చోటుచేసుకున్న పరస్పర దాడుల నేపథ్యంలో ఈ జలసంధిలో నౌకల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయేమోనన్న అంతర్జాతీయ ఆందోళనలకు తెరదించుతూ, ప్రస్తుతం నౌకల ప్రయాణం స్థిరంగా సాగుతోంది.

మెరైన్‌ డేటా విశ్లేషణ

ప్రముఖ అంతర్జాతీయ డేటా విశ్లేషణా సంస్థ 'కెప్లర్' నివేదిక ప్రకారం.. జూలై 1, బుధవారం నాడు ఈ జలసంధి గుండా 34 వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయి. రెండు వైపులా సమాన సంఖ్యలో నౌకలు ప్రయాణించడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు, ముఖ్యంగా చమురు దిగుమతి చేసుకునే దేశాలకు పెద్ద ఊరటనిచ్చే విషయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

అదేవిధంగా విండ్‌వార్డ్ ఏఐ అనే మరో మెరైన్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. అంతకుముందు రోజు అంటే జూన్‌ 30 వ తేదీ సోమవారం కూడా 42 నౌకలు రాకపోకలు సాగించాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం, క్షిపణి దాడులు జరుగుతున్నప్పటికీ.. వాణిజ్య నౌకలు ఈ మార్గంలో ధైర్యంగా ముందుకు సాగడం అంతర్జాతీయ వాణిజ్య రంగానికి ఊపిరి పోసినట్లయింది.

ఉద్రిక్తతల నీడలో మారిన గణాంకాలు

గడిచిన కొన్ని రోజుల్లో హోర్ముజ్ జలసంధిలో నమోదైన నౌకల రాకపోకల గణాంకాలు అంతర్జాతీయ చమురు సంక్షోభ తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి ఇరాన్‌కు మధ్య యుద్ధ వాతావరణం ముదిరిన తర్వాత, జూన్ 24న రికార్డు స్థాయిలో ఒకే రోజు 70 నౌకలు ఈ జలసంధిని దాటాయి. రాబోయే రోజుల్లో యుద్ధం వస్తే మార్గం మూసుకుపోతుందనే భయంతో నౌకలు త్వరత్వరగా ఈ ప్రాంతాన్ని దాటి వెళ్ళడమే దీనికి కారణం. ఈ యుద్ధ సంక్షోభం ప్రారంభం కాకముందు, సాధారణ రోజుల్లో ఈ జలసంధి గుండా రోజుకు సగటున 130 నుండి 140 నౌకలు ప్రయాణించేవి. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల ఆ సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, పూర్తిగా నిలిచిపోకుండా 30 నుండి 40 నౌకలు నడవడం కూడా సానుకూల పరిణామమే.

హోర్ముజ్ జలసంధి నిర్వహణ, భద్రతపై అమెరికా-ఇరాన్ ల మధ్య వివాదం ఇంకా పూర్తిగా సమసిపోలేదు. కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే ఈ జలమార్గం తెరిచి ఉంచడం ఇరు పక్షాలకూ అవసరమే. అందుకే, తెరవెనుక దౌత్యంతో వాణిజ్య నౌకలకు మార్గాన్ని సుగమం చేస్తున్నారనేది ఇంటర్నేషనల్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న అసలు నిజం. రాబోయే రోజుల్లో ఈ నౌకల సంఖ్య మరింతగా పెరిగితే ప్రపంచ వాణిజ్యానికి ఊరట లభిస్తుంది. ఆయిల్‌ కొరత నుంచి దేశాలు బయటపడతాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu