సూళ్ళూరుపేట: రాజకీయ క్షేత్రంలో ప్రజా సమస్యలపై గళమెత్తే సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ , నేడు క్రికెట్ మైదానంలో బ్యాట్ పట్టి సందడి చేశారు.
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 'సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రీమియర్ లీగ్' క్రికెట్ టోర్నమెంట్‌ను ఆమె అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మైదానంలో చోటుచేసుకున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
ఎమ్మెల్యే స్వయంగా క్రీజులోకి దిగి బ్యాటింగ్ చేయగా, ఆమె భర్త బౌలర్ అవతారమెత్తి బంతులు వేయడం విశేషం. భర్త వేసిన బంతులను ఎమ్మెల్యే అంతే చాకచక్యంగా ఎదుర్కొంటూ బ్యాట్ ఝుళిపించడంతో గ్రౌండ్ మొత్తం కేరింతలతో మారుమోగిపోయింది. ప్రజాప్రతినిధి హోదాను పక్కన పెట్టి, ఒక సామాన్య క్రీడాకారిణిలా ఆమె చూపిన ఉత్సాహం యువతలో కొత్త స్ఫూర్తిని నింపింది. ఎమ్మెల్యే దంపతులతో పాటు పలువురు మండల స్థాయి నాయకులు కూడా బ్యాట్ పట్టి కాసేపు క్రికెట్ ఆడి జోర్దార్ హంగామా చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి ఎంతో అవసరమని, నియోజకవర్గ యువతలోని ప్రతిభను ప్రోత్సహించేందుకే ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు మరియు క్రికెట్ అభిమానుల సమక్షంలో ఈ ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఉత్సాహంగా సాగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే దంపతుల క్రికెట్ హంగామా నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.

