Supreme Court: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Supreme Court: దేశంలో రిజర్వేషన్ల (Reservations) ఫలాలు అందుకొని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు..
తరతరాలుగా అదే కోటాను కోరుకోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. "తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులై, ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు.. ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకు?" అని సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన ప్రశ్నలు సంధించింది.
వెనుకబడిన వర్గాల్లోని 'క్రీమీలేయర్' (Creamy Layer - ధనిక, ఉన్నత శ్రేణి) పరిమితులు, రిజర్వేషన్ల మినహాయింపులపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న మాట్లాడుతూ.. విద్య, ఆర్థిక సాధికారత ద్వారా సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థాయి (Social Mobility) లభిస్తుందని పేర్కొన్నారు. "రిజర్వేషన్ల ద్వారా ఒకసారి ఉన్నత స్థాయికి చేరుకున్నాక కూడా, మళ్లీ మళ్లీ వారి పిల్లల కోసం కోటాను ఆశించడం సరికాదు. ఇలాగైతే మనం రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేం. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంది" అని వ్యాఖ్యానించారు.
ఒక వ్యక్తి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉండవచ్చని.. కానీ, రిజర్వేషన్ల ప్రయోజనం పొంది తల్లిదండ్రులు ఉన్నత స్థానాలకు వెళ్లినప్పుడు వారి పిల్లల పరిస్థితి ఖచ్చితంగా మారుతుందని, ఇక్కడ ఒక సమతుల్యత (Balance) అవసరమని కోర్టు స్పష్టం చేసింది.
ఒకే కుటుంబంలో ఉన్నత వర్గాలే అన్ని అవకాశాలను చేజిక్కించుకుంటే, అదే వర్గంలోని అత్యంత వెనుకబడిన పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల ఫలాలు కేవలం కొందరికే పరిమితం కాకుండా, సమాజంలో కిందిస్థాయిలో ఉన్న చివరి వ్యక్తికి కూడా అందాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం ఓబీసీలకే (OBC) పరిమితమైన 'క్రీమీ లేయర్' నిబంధనలను, ఎస్సీ, ఎస్టీ (SC, ST) వర్గాలకు కూడా మరింత శాస్త్రీయంగా విస్తరించడం, అమలు చేయడంపై న్యాయస్థానం తన అభిప్రాయాలను పంచుకుంది.

