Suryapet: రైతన్నలకు ఎస్పీ హెచ్చరిక అకాల వర్షం వస్తే ఆ పని చేయాల్సిందే!
సూర్యాపేట జిల్లా: ఎస్పీ నరసింహ ఐపీఎస్ టేకుమట్ల శివారులో ధాన్యం ఆరబోసిన రైతులను పలకరించి పంట విధానం, ధాన్యం ఎంపిక, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
వేసవిలో ఉరుములు, మెరుపులు, గాలిదుమారంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడవకుండా పట్టాలు, తార్ఫలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని రైతులకు సూచించారు. వర్షంలో తడిసి నాణ్యత తగ్గకముందే ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు తరలించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని, రోడ్లపై ధాన్యం ఆరబోస్తే వాహనదారులు ప్రమాదాలకు గురవుతారని హెచ్చరించారు.
అంతేకాకుండా వ్యవసాయ అధికారుల సలహాలతో నాణ్యమైన విత్తనాలు ఎంచుకుని ఆధునిక వ్యవసాయం చేసి ఎక్కువ దిగుబడి సాధించాలని కోరారు. సీజన్ ప్రారంభంలో గ్రామాల్లోకి వచ్చే దళారుల నుంచి నకిలీ విత్తనాలు కొనవద్దని, నమ్మకమైన డీలర్లు లేదా ప్రభుత్వ వ్యవసాయ కేంద్రాల నుంచే కంపెనీ లేబుల్ ఉన్న విత్తనాలు కొనుగోలు చేయాలని తెలిపారు. నకిలీ విత్తనాల సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు, డయల్ 100కు లేదా సూర్యాపేట జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712686057కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

