Suryapet: గర్వకారణం ఇండిగో క్యాడెట్ పైలట్‌గా నట్టే జశ్వంత్ ఎంపిక
సూర్యాపేట: సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు అసామాన్య సంకల్పంతో తన కలను సాకారం చేసుకున్నాడు.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నట్టే జశ్వంత్ ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాడెట్ పైలట్‌గా ఎంపికై సూర్యాపేటకు పేరు తీసుకువచ్చాడు.
సూర్యాపేటకు చెందిన నట్టే కిరణ్ కుమార్ - సునిత దంపతుల కుమారుడైన జశ్వంత్ చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని కలగన్నాడు. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు బీటెక్ పూర్తి చేసి నెలకు రూ. 85 వేల వేతనంతో ఉద్యోగంలో చేరాడు. జీవితం సాఫీగా సాగుతున్నా తాను అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయాననే తపనతో ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ పైలట్ శిక్షణ దిశగా అడుగులు వేశాడు.
దృఢ సంకల్పం, కష్టపడే తత్వంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వహించిన క్యాడెట్ పైలట్ పరీక్షకు సిద్ధమయ్యాడు. దేశవ్యాప్తంగా వేలాది మంది పోటీపడిన ఈ పరీక్షలో భారతదేశం నుంచి కేవలం 21 మంది మాత్రమే ఎంపికయ్యారు. వారిలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక అభ్యర్థిగా నట్టే జశ్వంత్ నిలిచాడు. ఎంపికైన జశ్వంత్ తొలుత రాబోయే మూడు నెలల పాటు ఢిల్లీలో క్యాడెట్ పైలట్ శిక్షణ పూర్తి చేసుకోనున్నాడు. అనంతరం 18 నెలల పాటు అమెరికాలో అధునాతన విమాన శిక్షణలో పాల్గొంటాడు.
జశ్వంత్ సాధించిన ఈ విజయం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని సూర్యాపేట పట్టణ ప్రముఖులు అభినందించారు. సూర్యాపేట చరిత్రలో ఇప్పటివరకు పైలట్‌గా పనిచేసిన వారు లేరని, జశ్వంత్ ఎంపిక జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. క్యాడెట్ శిక్షణ పూర్తి చేసుకుని మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ తల్లిదండ్రుల కృషిని కొనియాడారు. సామాన్య నేపథ్యం నుంచి వచ్చి అసామాన్య ప్రతిభ కనబరిచిన నట్టే జశ్వంత్ కథ ఇప్పుడు సూర్యాపేట యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

