Suryapet: జాజిరెడ్డిగూడెంలో వడ్ల కొనుగోళ్ల రచ్చ తరుగు దోపిడీపై రైతుల ఆవేదన
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలో ధాన్యం కొనుగోళ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఐకేపీ కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం పోసినా కాంటాలు వేయడంలో సిబ్బంది జాప్యం చేస్తున్నారని, తరుగు పేరుతో దోపిడీ జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా నాయకుడు పోలేబోయిన కిరణ్ స్పందించారు. ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న కొనుగోలు కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంటాలు వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే, రోజుల తరబడి లోడ్ దించకుండా మిల్లర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తాలు, నాణ్యత లేదనే సాకుతో ధాన్యం దించేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారని, క్వింటాలుకు కొంత కటింగ్ ఇస్తేనే లోడ్ దించుతున్నారని వాపోయారు.
కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టాలంటే 100 బస్తాలకు ఒక బస్తా కటింగ్ లేదా, 700 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని పోలేబోయిన కిరణ్ తెలిపారు. "రైతులు కష్టపడి పండించిన 100 బస్తాల ధాన్యానికి ఒక బస్తా చొప్పున కటింగ్ చేసి రేటు కడుతున్నారు. అన్నదాతల అర్ధనాదాలు పట్టించుకునేదెవరు?" అని ఆయన ప్రశ్నించారు.
తాలు పేరుతో, నాణ్యత లేదనే సాకుతో మిల్లర్లు, కొనుగోలు సెంటర్ వాళ్ళు దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

