Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Suryapet: సూర్యపేటలో ఈనెల 25న జలగం జనార్దన్ స్మారక ఉపన్యాస సభ

Suryapet: సూర్యపేటలో ఈనెల 25న జలగం జనార్దన్ స్మారక ఉపన్యాస సభ

hmtv 5 days ago

Suryapet: సూర్యపేటలో ఈనెల 25న జలగం జనార్దన్ స్మారక ఉపన్యాస సభ

సూర్యపేట: సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు, దివంగత నేత కామ్రేడ్ జలగం జనార్దన్ (జెన్ను సార్) 5వ వర్ధంతి సందర్భంగా ఈనెల 25న సూర్యపేట జిల్లా కేంద్రంలో స్మారక ఉపన్యాస సభ నిర్వహించనున్నారు.

'నక్సలిజం - దాని ప్రాధాన్యత' అనే అంశంపై జరిగే ఈ సభను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య పిలుపునిచ్చారు.

చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో శనివారం సభకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ, దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అసమానతలు ఉన్నంతకాలం కమ్యూనిస్టులు, నక్సలైట్లు ఉంటారని, టార్గెట్లు పెట్టుకొని వారిని అంతం చేయాలనుకోవడం అవివేకమన్నారు.

జెన్ను సార్ విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాలు, హేతువాదాన్ని అలవర్చుకొని పార్టీలో చేరారని గుర్తుచేశారు. అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించి, పోలీసు కేసులు, జైలు నిర్బంధాలు ఎదుర్కొన్నారని, చివరి శ్వాస వరకు వ్యవస్థ మార్పు కోసం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రభుత్వ విధానాలపై పోరాడాల్సిన కర్తవ్యాలను రూపొందించుకోవాలన్నారు.

మోడీ ప్రభుత్వం నక్సలైట్లను నిర్మూలించాలని తహతహలాడుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని విమర్శించారు. భిన్న రాజకీయాలు కలిగిన విప్లవకారులను చట్ట విరుద్ధంగా అంతమొందించడం మూర్ఖత్వమని అన్నారు. అసమానతలు ఉన్నంతకాలం నక్సలిజం సమస్య ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మారుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుత వ్యవస్థ స్వరూప స్వభావాలను అర్థం చేసుకున్నప్పుడు ఈ దేశానికి నక్సలిజం అవసరం ఉందా లేదా అనేది చర్చనీయాంశమవుతోందని, అందుకే ఈ అంశంపై సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవీ చలపతిరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, పీవైఎల్ నాయకులు దండి ప్రవీణ్, దూదిపాల ప్రవీణ్, పెద్దింటి అశోక్ రెడ్డి, అరుణోదయ జిల్లా కమిటీ సభ్యులు బోల్కా పవన్, రాజేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu