Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana Cabinet : యాదాద్రి, భద్రాద్రి ఫైళ్లు సీబీఐకి.. రిజిస్ట్రేషన్ల మోతకు రంగం సిద్ధం

Telangana Cabinet : యాదాద్రి, భద్రాద్రి ఫైళ్లు సీబీఐకి.. రిజిస్ట్రేషన్ల మోతకు రంగం సిద్ధం

hmtv 2 weeks ago

Telangana Cabinet

Telangana Cabinet

Telangana Cabinet : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రధానంగా విద్యుత్ రంగంలో జరిగిన భారీ అక్రమాలపై సీబీఐ విచారణకు మొగ్గు చూపడం, భూముల విలువ పెంపు వంటి నిర్ణయాలు రాజకీయంగా, పరిపాలనాపరంగా పెను సంచలనంగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్ సమర్పించిన 114 పేజీల నివేదికను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ కేసులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రమేయం ఉన్నందున నిష్పాక్షిక విచారణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది.

భూముల ధరల సవరణ

రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను శాస్త్రీయ పద్ధతిలో సవరించాలని కేబినేట్ నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్ ధరలకు, ప్రభుత్వ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో దీనిని క్రమబద్ధీకరించనున్నారు. ఈ నెల చివరి వారం నుంచే కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అయితే, హిల్ట్ (HILT) పాలసీ కింద దరఖాస్తు చేసుకునే వారికి ఊరటనిస్తూ.. పాత ధరలకే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీనికోసం ముందుగా 10 శాతం చెల్లించి, మిగిలిన 90 శాతాన్ని 90 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది.

పాల డైరీల బలోపేతం & సోలార్ ప్రాజెక్టులు

నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని (NARMAC) జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి బోర్డు (NDDB)కు అప్పగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇకపై నిర్వహణ, మార్కెటింగ్ బాధ్యతలను ఎన్డీడీబీ చూసుకుంటుంది. మరోవైపు, విద్యుత్ పొదుపులో భాగంగా 9 జిల్లాల్లోని 33/11 కేవీ సబ్ స్టేషన్ల వద్ద పైలట్ ప్రాజెక్టుగా 18 సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.66.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

ఓటీఎస్ వెసులుబాటు

హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పేరుకుపోయిన పన్ను బకాయిల క్లియరెన్స్ కోసం వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని కేబినేట్ ఆమోదించింది. దాదాపు రూ.5864 కోట్ల బకాయిలు ఉండగా, జరిమానాలు, వడ్డీలు మినహాయించి రూ.1686 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జల మండలికి చెల్లించాల్సిన నీటి బకాయిలను కూడా ఇదే పద్ధతిలో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.

విద్యా రంగంలో మార్పులు, మార్కెట్ల కేటాయింపు

రాష్ట్రంలోని ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, టీ-శాట్ వంటి సంస్థలన్నింటినీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల నైపుణ్య శిక్షణలో ఏకరూపత వస్తుందని భావిస్తున్నారు. అలాగే, రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్‌లో 42 ఎకరాల్లో అత్యాధునిక కూరగాయల మార్కెట్ నిర్మాణానికి భూమిని కేటాయించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఇంచార్జ్ మంత్రులను సీఎం ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu