Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం అమలు చేసిన వాలంటీర్ల వ్యవస్థ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో, కానీ పూర్తి భిన్నమైన లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది.
రైతులకు సాగులో అండగా నిలిచేందుకు 'సాయిల్ హెల్త్ వాలంటీర్లను' (Soil Health Volunteers) నియమించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
గ్రామానికి ముగ్గురు.. రాష్ట్రవ్యాప్తంగా 30 వేలు!
రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు వాలంటీర్ల చొప్పున, మొత్తం 30,000 మందిని ప్రభుత్వం నియమించనుంది. ఈ వాలంటీర్లు కేవలం రాజకీయ లేదా పరిపాలనా పరమైన పనులకు పరిమితం కాకుండా, పూర్తిగా వ్యవసాయాధారిత సేవలు అందించనున్నారు.
వాలంటీర్ల బాధ్యతలు ఇవే:
భూసార పరీక్షలు: రైతుల భూమిలోని పోషకాలను పరీక్షించి, నేల స్వభావాన్ని బట్టి సూచనలు ఇస్తారు.
పెట్టుబడి తగ్గింపు: తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే మెళకువలను రైతులకు వివరిస్తారు.
అవగాహన సదస్సులు: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించడం.
శిక్షణ: వీరికి ఇక్రిశాట్ (ICRISAT) మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా శిక్షణ ఇస్తాయి.
కొడంగల్ నుంచే శ్రీకారం
ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎంపికైన వాలంటీర్లకు శిక్షణ ప్రారంభమైంది. ఇక్రిశాట్‌లో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల స్వయంగా ప్రారంభించారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారు క్షేత్రస్థాయిలో రైతులకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పిస్తారు.
మే 4 నుండి రైతు ఉత్సవాలు
భూసార పరిరక్షణను ఒక ఉద్యమంలా చేపడతామని మంత్రి తుమ్మల తెలిపారు. రసాయన ఎరువులకు బదులుగా జీలుగు, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట ఎరువులను వాడాలని ఆయన రైతులకు సూచించారు. అలాగే, మే 4 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా 'రైతు ఉత్సవాలను' ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో అన్నదాతలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

