TG EdCET 2026 Results: తెలంగాణ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదల.. టాప్ ర్యాంకర్ ఎవరంటే?
TG EdCET 2026 Results: తెలంగాణలో రెండేళ్ల బీఈడీ (B.Ed) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'TG EdCET 2026' ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి.
శనివారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ (VC) ఆచార్య ప్రతాప్‌రెడ్డి సంయుక్తంగా ఈ ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది ఎడ్‌సెట్ ఫలితాల్లో అభ్యర్థులు భారీగా ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు.
ఈ ఏడాది ఎడ్‌సెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడ్డారు. 35,600 మంది అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 29,342 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో ఏకంగా 28,446 మంది అభ్యర్థులు కౌన్సిలింగ్‌కు అర్హత సాధించారు. ఈ ఏడాది మొత్తంగా 96.95 శాతం రికార్డు స్థాయి ఉత్తీర్ణత నమోదైంది.
ఈ ఏడాది ప్రకటించిన ఫలితాల్లో బానోత్ అజిత్ సాయి రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి, ఎడ్‌సెట్‌లో మొదటి ర్యాంకు (State First Rank) సాధించారు. టాపర్‌గా నిలిచిన అజిత్ సాయిని ఉన్నత విద్యా మండలి అధికారులు మరియు కాకతీయ వర్సిటీ వీసీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో ఎడ్‌సెట్ కన్వీనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.
ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ కూడా అందుబాటులో ఉంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్ లేదా పుట్టిన తేదీని ఉపయోగించి ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ edcet.tgche.ac.inలో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.

