Tirumala: అభిషేక సేవ సమయంలో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం
Tirumala: కొండంత జనంతో సప్తగిరులు కిక్కిరిసిపోయాయి. సామాన్య భక్తుల కష్టాలను, వారి మనోభావాలను అర్థం చేసుకున్న టీటీడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి, భక్తులకు ఒక తీపి కబురు అందించారు.
సాధారణంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన శుక్రవారం అభిషేక సేవ ను చూసే అవకాశం కేవలం పరిమితంగానే ఉంటుంది. కానీ, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జరిగే ఈ అభిషేక సేవను ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యాన్ని సామాన్య భక్తులకు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఒక్క నిర్ణయంతో ఏకంగా 5,850 మంది సామాన్య భక్తులకు శ్రీవారి అభిషేక సేవను కళ్లారా వీక్షించే అద్భుత అవకాశం లభించింది. ఉదయం 4 గంటల నుంచే భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ, ఇప్పటికే 13 కంపార్ట్ మెంట్ లలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. టీటీడీ బోర్డు తీసుకన్న నిర్ణయాన్ని భక్తులు స్వాగతిస్తున్నారు.
ఏడుకొండలు భక్తజనసంద్రమయ్యాయి. కోనేటిరాయుడి దర్శనార్ధం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటుడడంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శనం..స్లాటెడ్ సర్వ దర్శనానికి 5గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ నేపధ్యంలో గదుల కొరత ఏర్పడింది. దీంతో గదుల దొరక్క భక్తులు రోడ్ల పైనే సేదతీరుతున్నారు.
తిరుమలలో ఎటు చూసిన భక్తులతో కిక్కరిసిన క్యూలైన్లే దర్శనమిస్తున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు భక్తులతో నిండి క్యూలైన్లు వెలుపలకి వచ్చేశాయి. సుమారు 3 కిలో మీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. కాలినడకన ప్రవాహంలా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. నడక మార్గాన తిరుమల వస్తున్న భక్తులు కూడ సర్వదర్శనం క్యూలైన్ గుండా శ్రీవారిని దర్శించుకోవాల్సి వస్తుండడంతో సర్వదర్శనం క్యూలైన్ అంతకంతకు పెరుగుతోంది. భక్తుల అధిక రద్దీ నేపథ్యంలో బ్రేకు దర్శనం టిక్కెట్ల జారీని టీటీడీ నియంత్రించి కేవలం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలైన్ల వద్ద టీటీడి అన్నప్రసాద విభాగం అన్నపానీయాలను సరఫరా చేస్తోంది. దీంతో గంటల తరబడి క్యూ లైనల్లో వేచి వున్నప్పటికి టీటీడీ అందిస్తున్న అన్నపానీయాలతో భక్తులకు కాస్త ఉపశమనం కలుగుతోంది.

