Tirupati: తిరుపతిలో ఘనంగా 'రీజినల్ పల్మో అప్‌డేట్-2026' వైద్య సదస్సు
తిరుపతి: దేశంలో వేగంగా పెరుగుతున్న ఊపిరితిత్తుల వ్యాధుల నివారణ, అత్యాధునిక చికిత్సా విధానాలపై వైద్యులకు అవగాహన కల్పించే లక్ష్యంతో తిరుపతిలో ఆదివారం 'రీజినల్ పల్మో అప్‌డేట్-2026' పేరుతో రాష్ట్రస్థాయి వైద్య విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించారు.
పుపుస (పల్మనరీ) మరియు క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు రాయలసీమ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి 500 మందికి పైగా వైద్యులు హాజరయ్యారు.
పెరుగుతున్న కాలుష్యం, జనాభా, వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావంతో టీబీ, ఆస్తమా, సీఓపీడీ, నిమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి శ్వాసకోశ వ్యాధులు తీవ్రంగా పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీబీ, ఆస్తమా, సీఓపీడీ కేసుల్లో భారత్ ప్రపంచంలోనే అత్యధిక భారం మోస్తున్న దేశంగా మారిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ వి. నాగార్జున మాటూరు మాట్లాడుతూ, మెట్రో నగరాలకే పరిమితమవుతున్న ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ప్రాంతీయ వైద్యులకు చేరవేసేందుకు తిరుపతిలో ఈ సదస్సును నిర్వహించినట్లు తెలిపారు. ఆధునిక వైద్య సాంకేతికత, కొత్త చికిత్సా విధానాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై వైద్యులకు సమగ్ర శిక్షణ అందించామని చెప్పారు.
సదస్సులో సింగిల్ ఇన్‌హేలర్ ట్రిపుల్ థెరపీ, బయోలాజిక్స్, నావిగేషనల్ బ్రాంకోస్కోపీ, కోన్ బీమ్ సీటీ గైడెడ్ బయాప్సీలు, లంగ్ నాడ్యూల్ క్లినిక్, ఏఐ ఆధారిత నిర్ధారణ వంటి అత్యాధునిక వైద్య విధానాలను నిపుణులు వివరించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా చికిత్స అందించే సాంకేతికతలపై ప్రత్యేకంగా చర్చించారు.
క్రిటికల్ కేర్ విభాగంలో అత్యాధునిక వెంటిలేటర్లు, ఎక్మో (ECMO) యంత్రాల వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అందించే చికిత్సపై వైద్యులకు ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. అలాగే 12 హ్యాండ్స్-ఆన్ స్టేషన్లలో డమ్మీలు, సిమ్యులేటర్ల ద్వారా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విధానాలను ప్రాక్టికల్‌గా నేర్పించారు.
ఈ సదస్సుకు సీనియర్ పల్మనాలజిస్టులు, క్రిటికల్ కేర్ నిపుణులు, ప్రాంతీయ వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరై శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో తాజా పరిణామాలపై చర్చించారు. వైద్య విజ్ఞానాన్ని ప్రాంతీయ స్థాయికి విస్తరించడంలో ఈ సదస్సు కీలక వేదికగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

