Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Trump-Xi China Talks: చైనా - అమెరికా చర్చలుః ఇరాన్‌కు లాభమా నష్టమా?

Trump-Xi China Talks: చైనా - అమెరికా చర్చలుః ఇరాన్‌కు లాభమా నష్టమా?

hmtv 1 week ago

Trump-Xi China Talks: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా గడ్డపై అడుగుపెట్టారు. ప్రపంచాన్ని శాసించే ఇద్దరు అగ్రనేతలు బీజింగ్‌లో భేటీ కావడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది.

సుమారు 40 గంటల పాటు సాగే ఈ పర్యటనలో వాణిజ్య ఒప్పందాలతో పాటు, ఇరాన్ యుద్ధం, తైవాన్ అంశాలు ప్రధాన చర్చాంశాలుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చర్చలు ఇరాన్‌కు లాభమా లేక నష్టమా అనే కోణంలో విశ్లేషిద్దాం.

ఇరాన్‌తో యుద్ధం కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ట్రంప్ చైనా పర్యటన ప్రారంభమైంది. హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు, అణు కార్యక్రమాల నియంత్రణ వంటి అంశాలపై చైనా ద్వారా ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. అయితే, ఈ చదరంగంలో చైనా వేసే అడుగులు ఇరాన్‌కు రక్షణ కవచంలా మారతాయా లేక ఇబ్బందిగా పరిణమిస్తాయా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

అమెరికా బలహీనత.. చైనా బలం

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ట్రంప్ కొంత బలహీనమైన స్థితిలో చర్చలకు కూర్చున్నారు. అమెరికాలో పెరుగుతున్న చమురు ధరలు, యుద్ధం పట్ల స్వదేశంలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత ట్రంప్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇక, యుద్ధ విమానాల తయారీలో ఉపయోగించే రేర్‌ ఎర్త్‌ ఖనిజాల సరఫరాలో చైనా గుత్తాధిపత్యం కొనసాగిస్తోంది. రేర్‌ ఎర్త్‌ ఖనిజాలు లేకుండా యుద్ధ విమానాల తయారీ పూర్తికాదు. ఈ ఖనిజాల కోసం ట్రంప్‌ గతంలో ఉక్రెయిన్‌ను తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. రష్యాతో జరుగుతున్న యుద్ధం కోసం అవసరమైన యుద్ధ సామాగ్రిని అందిస్తామని హామీ ఇస్తూ... దానికి బదులుగా ఉక్రెయిన్‌లో లభ్యమయ్యే రేర్‌ ఎర్త్‌ ఖనిజాలను కోరిన సంగతి తెలిసిందే.

మధ్యవర్తిగా చైనా?

ఇరాన్‌కు అతిపెద్ద చమురు కస్టమర్ చైనా. కాబట్టి, ఇరాన్‌ను చర్చల టేబుల్ ముందుకు తీసుకురావడంలో చైనా పాత్ర కీలకమని ట్రంప్ నమ్ముతున్నారు. ఇప్పటికే రెండుసార్లు చర్చలకు అంగీకరించినా అమెరికా దాడులు ఆపలేదని ఇరాన్‌ ఆగ్రహంతో ఉన్నది. అంతేకాదు, ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి ఇప్పటికే చైనాలో పర్యటించి తన వాదనను వివరించారు. అమెరికాను కట్టడి చేసేందుకు ప్రయత్నించాలని కోరారు. కానీ, చైనా ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఇది అమెరికా సృష్టించిన సమస్య. ఈ సమస్యను తామెందుకు పరిష్కరించాలని చైనా భావిస్తోంది. ఒకవేళ ఇరాన్‌తో ఒప్పందం కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహిస్తే... ఆ తరువాత ఆ ఒప్పందం నుంచి అమెరికా పక్కకు తప్పుకుంటే తమ పరిస్థితి ఏంటని చైనా ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు దూరంగా ఉండాలని చైనా భావిస్తోంది.

తైవాన్ చిక్కుముడి

ఇరాన్ అంశంపై అమెరికాకు సహకరించాలంటే, బదులుగా తైవాన్ విషయంలో తమకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని చైనా కోరవచ్చు. అమెరికా తన మిత్రదేశమైన తైవాన్‌ను వదులుకుంటుందా లేక ఇరాన్ విషయంలో రాజీ పడుతుందా అన్నది చూడాలి. ఈ 40 గంటల చర్చల్లో తక్షణమే ఒక భారీ పరిష్కారం దొరుకుతుందని ఆశించలేం. కానీ, ఇరాన్ విషయంలో చైనా గనుక మధ్యవర్తిత్వం వహిస్తే, అది ఇరాన్‌కు ఒక దౌత్యపరమైన భద్రతను ఇస్తుంది. అంటే, అమెరికా ఒంటెద్దు పోకడలకు చైనా రూపంలో ఒక అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి ఇరాన్ విషయంలో ఒక స్పష్టమైన 'బ్రేక్ త్రూ' రాకపోయినా, చైనా అండతో ఇరాన్ తన పట్టును నిలుపుకునే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ తన వ్యాపార శైలిలో ఏదైనా 'గ్రాండ్ డీల్' ప్రకటిస్తే తప్ప, ఇరాన్ పరిస్థితిలో పెద్ద మార్పు ఉండకపోవచ్చు. లోకమంతా ఇప్పుడు బీజింగ్ వైపే చూస్తోంది! నెక్ట్స్‌ ఏం జరుగుతుందని.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu