twisha sharma
Twisha Sharma : మాజీ నటి, మోడల్ ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తును ముమ్మరం చేసింది.
భోపాల్‌లోని ఆమె అత్తవారి ఇంట్లో మే 12న జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన అసలు రహస్యాన్ని ఛేదించడానికి సీబీఐ అత్యంత అధునాతనమైన సాంకేతికతను రంగంలోకి దించింది. ఆమె మరణానికి ముందు ఏం జరిగిందనే చివరి క్షణాలను డిజిటల్ రూపంలో పునర్నిర్మించేందుకు 'టన్నెల్ వ్యూ' (Tunnel View) అనే వినూత్న ఇన్వెస్టిగేషన్ టెక్నిక్‌ను అధికారులు ఉపయోగిస్తున్నారు.
ఏమిటీ 'టన్నెల్ వ్యూ' టెక్నిక్.?
ట్విషా శర్మ మరణానికి దారితీసిన పరిస్థితులు, ఆ రాత్రి జరిగిన సంఘటనల క్రమాన్ని నిమిషాల వారీగా విశ్లేషించడానికి ఈ వర్చువల్ మోడల్ ఉపయోగపడుతుంది. 'టన్నెల్ వ్యూ' పద్ధతి ద్వారా దర్యాప్తు అధికారులు ఘటనా స్థలంలోని సిసిటివి (CCTV) ఫుటేజ్, మొబైల్ ఫోన్ రికార్డులు, వైఫై లాగ్‌లు, ఇంటర్నెట్ యాక్టివిటీ, స్మార్ట్ డివైజ్ డేటా, ఫోరెన్సిక్ మ్యాపింగ్ , సాక్షుల వాంగ్మూలాలను ఒకే టైమ్‌లైన్‌లోకి తెచ్చి సమకాలీకరిస్తారు. దీని ద్వారా భోపాల్ కటారా హిల్స్ నివాసంలోని గదులను వర్చువల్ స్పేషియల్ మోడల్‌గా మార్చి, ఆ రాత్రి ఇంట్లోకి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు అనే పూర్తి విజువలైజేషన్‌ను సీబీఐ సృష్టించబోతోంది. సాక్షుల మాటల్లోని అబద్ధాలను, డిజిటల్ సాక్ష్యాల ఆధారంగా పట్టుకోవడమే ఈ టెక్నిక్ ముఖ్య ఉద్దేశం.
అత్త అరెస్ట్.. లొంగిపోయిన భర్త
ఈ కేసులో సరికొత్త పరిణామంగా సీబీఐ మే 28న ట్విషా శర్మ అత్తగారైన గిరిబాల సింగ్‌ను భోపాల్‌లోని ఆమె నివాసంలో విచారించి అదుపులోకి తీసుకుంది. గతంలో జిల్లా కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన గిరిబాల సింగ్‌కు సెషన్స్ కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేయడంతో ఈ అరెస్ట్ సాధ్యమైంది. మరోవైపు, కేసు నమోదైన తర్వాత 10 రోజుల పాటు పరారీలో ఉన్న ట్విషా భర్త సమర్థ్ సింగ్ మే 22న జబల్‌పూర్‌లో లొంగిపోవడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సీబీఐ ఈ తల్లి, కొడుకులను ఎదురెదురుగా కూర్చోబెట్టి, డిజిటల్ సాక్ష్యాల ఆధారంగా విచారించేందుకు ప్లాన్ చేస్తోంది.
అసలేం జరిగింది? అనుమానాలు-ఆరోపణలు
నోయిడాకు చెందిన మాజీ నటి ట్విషా శర్మకు, భోపాల్‌కు చెందిన సమర్థ్ సింగ్‌కు గత డిసెంబర్‌లోనే వివాహమైంది. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే, మే 12న ఆమె తన అత్తవారింట్లో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని కనిపించింది. ట్విషా తల్లిదండ్రులు ఆమె అత్తమామలపై, భర్తపై శారీరక వేధింపులు, గృహహింస, మానసిక క్షోభతో పాటు 'హత్య' చేశారనే తీవ్ర ఆరోపణలు చేశారు. దర్యాప్తును అత్త ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) లో రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించే వరకు అంత్యక్రియలు కూడా చేయనని మొండికేశారు. చివరికి మే 24న ఎయిమ్స్‌లో రెండోసారి పోస్ట్‌మార్టం పూర్తయ్యాక అంత్యక్రియలు నిర్వహించారు.
కానీ, ట్విషా అత్త కుటుంబం ఈ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చింది. ఏప్రిల్‌లో తనకు ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుండి ట్విషా వింతగా ప్రవర్తించేదని, ఆమెకు పిల్లలు కనడం ఇష్టం లేక అబార్షన్ చేయించుకోవాలని భావించిందని వారు వాదించారు. ఈ నేపథ్యంలో, ఆ రాత్రి అక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. మధ్యప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తిరిగి రీ-రిజిస్టర్ చేసుకుని రంగంలోకి దిగిన సీబీఐ, ఈ 'టన్నెల్ వ్యూ' డిజిటల్ రీకన్‌స్ట్రక్షన్ ద్వారా కేసులోని అసలు నిజాలను, కుట్రలను త్వరలోనే బయటపెట్టనుంది.

