Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Uppal: అన్నదాతలకు 'ఎలక్ట్రిక్' భరోసా.. ఉప్పల్ NGRIలో ఈ-ట్రాక్టర్ రోడ్‌షో అద్భుతం!

Uppal: అన్నదాతలకు 'ఎలక్ట్రిక్' భరోసా.. ఉప్పల్ NGRIలో ఈ-ట్రాక్టర్ రోడ్‌షో అద్భుతం!

hmtv 1 week ago

ప్పల్ (హైదరాబాద్): హైదరాబాద్‌ లోని సీఎస్‌ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఈ-ట్రాక్టర్‌, ఈ-టిల్లర్‌ల జాతీయ రోడ్‌షోను ఘనంగా నిర్వహించారు.

శాస్త్రీయ ఆవిష్కరణలను సమాజ ప్రయోజనాలకు ఉపయోగించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం రైతుల్లో విశేష ఆసక్తి రేకెత్తించింది. అనంతరం సంస్థ ప్రాంగణంలోని సభా మందిరంలో సాంకేతిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస రెడ్డి హాజరై ప్రసంగించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను చేరువ చేయడం, పర్యావరణహిత వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు అనుకూలంగా రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ వ్యవసాయ యంత్రాలు తక్కువ ఖర్చుతో పనిచేయడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

సీఎస్‌ఐఆర్-సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ నరేష్ చంద్ర ముర్ము ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఈ యంత్రాలు డీజిల్ యంత్రాలకు ప్రత్యామ్నాయంగా రూపొందించబడ్డాయి. తక్కువ శబ్దం, తక్కువ వైబ్రేషన్‌, సులభమైన నిర్వహణ వీటి ప్రత్యేకతలని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా సంప్రదాయ దుస్తులతో వ్యవసాయ పనులు చేసే మహిళా రైతులకు కూడా ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయని వివరించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ జాతీయ రోడ్‌షో ఇప్పటికే పలు వ్యవసాయ ప్రాంతాలను సందర్శించి రైతులకు ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలిపారు.

రైతులు పొలాల్లోనే ఈ యంత్రాల పనితీరును పరిశీలించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. సోలార్ చార్జింగ్ సదుపాయం, అధిక శక్తి సామర్థ్యం, ప్రభుత్వ సబ్సిడీలు కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వీటి వినియోగం మరింత విస్తరించే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎస్‌ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్ రైతు కేంద్రిత సాంకేతిక ఆవిష్కరణలు గ్రామీణాభివృద్ధికి ఎంతో అవసరమన్నారు. భూగర్భజలాల అన్వేషణ, భూసాంకేతిక పరిశోధనలు, నీటి వనరుల నిర్వహణలో సంస్థ చేస్తున్న సేవలను వివరించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ పరిశోధనలు జరగాలని, ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన సాంకేతికత రైతు పొలాలకు చేరాల్సిన అవసరం ఉందని సూచించారు. రైతులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, విద్యార్థులు సహా పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం వ్యవసాయ రంగంలో పర్యావరణహిత సాంకేతికతకు కొత్త దిశను చూపిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. పరిశుభ్రమైన ఇంధన వినియోగంతో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం రైతుల భవిష్యత్తుకు ఆశాజ్యోతి అవుతుందని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu