Uppal: ఉప్పల్ కు సీఎం రేవంత్ రెడ్డి.. 7న ఎంఎంసీ నూతన భవనానికి భూమిపూజ
ఉప్పల్: ఉప్పల్ ప్రాంత అభివృద్ధిలో మరో కీలక అడుగు పడనుంది. ఉప్పల్ భగాయత్‌లో నిర్మించనున్న మల్కాజిగిరి నగర పాలక సంస్థ (ఎంఎంసీ) నూతన ప్రధాన కార్యాలయ భవనానికి ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఉప్పల్ భగాయత్‌లో 9 ఎకరాల విస్తీర్ణంలో రూ.99 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు.
మూసీ నది ఒడ్డున నిర్మితమయ్యే ఈ కార్యాలయం మల్కాజిగిరి నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించడంలో కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్టు సాధనలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి చేసిన కృషి కీలకమని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
ఉప్పల్ భగాయత్‌లోనే నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అనుమతులు సాధించడంలో ఆయన ప్రత్యేక చొరవ చూపినట్లు తెలిపారు. భూమిపూజ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.
ఉప్పల్ భగాయత్‌లో మల్కాజిగిరి నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయ నిర్మాణం ప్రాంత అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని, దీనివల్ల ప్రజలకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన పౌర సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును సాధించగలిగామని, ఉప్పల్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామని మందముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.

