Dailyhunt
Uppal: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల దందా.. పీఎంఓ పేరుతోనే ఫేక్ లెటర్లా?

Uppal: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల దందా.. పీఎంఓ పేరుతోనే ఫేక్ లెటర్లా?

hmtv 1 week ago

Uppal: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల దందా.. పీఎంఓ పేరుతోనే ఫేక్ లెటర్లా?

ఉప్పల్: హైదరాబాద్‌ ఉప్పల్‌ లో ఐపీఎల్ టికెట్ల కోసం ప్రముఖుల పేర్లతో ఫోన్ కాల్స్, నకిలీ అధికారిక లేఖలను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీసులు బట్టబయలు చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు అశోక్‌ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు ఐపిఎల్ టిక్కెట్లు విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ టిక్కెట్లు పొందటం కోసం జడ్జిలు, ఉన్నతాధికారులమంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యవర్గ సభ్యులకు ఫోన్ కాల్స్ చేయడం, పీఎంఓ, గవర్నర్ కార్యాలయం, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, ముంబై క్రికెట్ అసోసియేషన్ పేర్లతో నకిలీ లేఖలు పంపించి టికెట్లు పొందేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది.

ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన హెచ్‌.సీఏ కార్యవర్గ ప్రముఖ ప్రతినిధి మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌ కు సమాచారం అందించడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు, హెచ్‌.సీఏ కార్యవర్గంతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. హెచ్. సీఏ వారు నిందితులకు ఐపీఎల్ టికెట్ల పేరుతో ఎర వేయగా, అక్కడికి వచ్చిన వాటిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులకు అప్పగించారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు, ఉప్పల్ ఎస్ఓటి పోలీసులతో కలిసి ప్రాథమిక నిర్ధారణ కోసం విచారణ చేపట్టారు. ఈ ముగ్గురిలో అశోక్ ప్రధాన వ్యక్తిగా ఎస్ఓటి పోలీసులు నిర్ధారించారు. ఎస్ఓటి పోలీసులు పూర్తి దర్యాప్తు కోసం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో కీలక వ్యక్తి అశోక్ ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రకాశం జిల్లా కందుకూరు ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.

అతనితో పాటు మరో ఇద్దరు కూడా అదే ప్రాంతానికి చెందినవారిగా సమాచారం. అశోక్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు నిర్ధారించగా, మిగతా ఇద్దరి పాత్ర పై విచారణ కొనసాగుతోంది. కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు ఈ ముఠాలో మరికొందరు కీలక వ్యక్తులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అశోక్ మొబైల్ ఫోన్ ఆధారంగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రముఖుల పేర్లతో ఫోన్ కాల్స్ చేయడం, నకిలీ లెటర్ లను వినియోగించడం వెనుక పెద్ద ముఠా ఉండే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu