Dailyhunt
Vastu Tips: ఈ చిన్న మార్పులతో ఇంటిని స్వర్గంగా మార్చుకోవచ్చు

Vastu Tips: ఈ చిన్న మార్పులతో ఇంటిని స్వర్గంగా మార్చుకోవచ్చు

hmtv 2 weeks ago

Vastu Tips: ఈ చిన్న మార్పులతో ఇంటిని స్వర్గంగా మార్చుకోవచ్చు

Vastu Tips: ఇంటి శాంతి, సౌఖ్యం, సిరిసంపద ఇవన్నీ మన నివాసంలో ఉన్న వివిధ శక్తులపై ఆధారపడి ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

అయితే, ఈ శక్తులను సమతుల్యం చేయడానికి ఇంటి వాస్తు కీలకమైనదిగా పండితులు చెబుతారు. వాస్తు సరిగా లేకుంటే అడ్డంకులు ఎదురౌతుంటాయి. వాస్తులో మార్పులు చేయడం అంటే ఇంటిని కూల్చడం కాదు...చిన్న చిన్న సవరణలతోనే ఇంటిని స్వర్గంలా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువ ఖర్చు లేకుండా సులభంగా చేయగల పరిహారాలు ఉంటే, అవి ప్రతి కుటుంబానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు అలాంటి సులభమైన వాస్తు చిట్కాలను మనం తెలుసుకుందాం.

కర్పూరం

మొదటిగా, వాస్తు దోషాల నివారణలో కర్పూరానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కర్పూరం ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తులను ఆకర్షించే శక్తి కలిగిన పవిత్ర పదార్థంగా చెబుతారు. ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం 1 లేదా 2 కర్పూరం ముక్కలను ఆవునెయ్యిలో ముంచి ఇంట్లో దోషం ఉన్న ప్రాంతంలో వెలిగిస్తే, ఆ ప్రాంతంలోని ప్రతికూల శక్తి క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాదు, వంటగదిలో రోజూ వంటచేసే ముందు కర్పూరం వెలిగించడం వల్ల కుటుంబ ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

గణపతి విగ్రహం

ఇంటికి ఈశాన్యం దిశ అత్యంత ముఖ్యమైనది. ఈ దిశను దేవతల స్థానం అని పిలుస్తారు. ఈ దిశలో చిన్న గణపతి విగ్రహం లేదా గణపతి పటాన్ని ఉంచడం వల్ల అడ్డంకులు తొలగి, శుభఫలితాలు కలుగుతాయి. అలాగే రాగిపాత్రలో నీరు పోసి అందులో 3 లేదా 5 పువ్వులు వేసి ఉంచితే ఇంట్లో శాంతి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ నీటిని ప్రతి 24 గంటలకు ఒకసారి మార్చడం మంచిది.

ప్రధాన ద్వారం

ఇంటికి ప్రధాన ద్వారం అత్యంత కీలకం. ప్రధాన ద్వారానికి గణపతి చిత్రపటం ఉంచడం వలన దుష్టశక్తులు లోపలికి రాకుండా అడ్డుకట్ట వేయబడుతుంది. ఇది వాస్తు పరంగా రక్షణ కవచంలా పనిచేస్తుంది. అదేవిధంగా ద్వారం శుభ్రంగా, కాంతివంతంగా ఉండటం కూడా చాలా ముఖ్యం.

వాయువ్యం

వాయవ్య దిశలో నిత్యం దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శక్తి ప్రవాహం సక్రమంగా జరుగుతుంది. ప్రతి రోజు సాయంత్రం కనీసం 30 నిమిషాలు అయినా నూనె దీపం లేదా నెయ్యి దీపం వెలిగిస్తే కుటుంబంలో కలహాలు తగ్గి, సఖ్యత పెరుగుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమంటే...ఇంట్లో అవసరం లేని పాత వస్తువులు, పాడైపోయిన వస్తువులను ఎక్కువగా ఉంచకూడదు. ఇవి ప్రతికూల శక్తులకు పెంచుతాయి. కాబట్టి నెలకు ఒకసారైనా ఇంటిని శుభ్రపరిచి ఇలాంటి వస్తువులను తొలగించడం మంచిది.

ప్రతిరోజు కనీసం ఇంటికోసం 10 నుంచి 15 నిమిషాలపాటు సమయాన్ని కేటాయించి ఈ సులభమైన పరిహారాలను పాటిస్తే ఇంటి వాతావరణం క్రమంగా మారిపోతుంది. శాంతి, సంతోషం, సిరిసంపదలతో ఇల్లు తులతూగుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu