Vikarabad: వికారాబాద్‌లో పారిశుధ్య కార్మికుల డప్పుల మోత!
Vikarabad: పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు నిరసన చేపట్టారు.
నిరసన అనంతరం బిజేఆర్ చౌరస్తా నుంచి మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి వరకు డప్పులతో ర్యాలీ నిర్వహించారు.
వినాయక చవితి పండుగ వేళ ప్రజలు ఆనందంగా పండుగలు జరుపుకుంటుంటే, పారిశుధ్య కార్మికులు మాత్రం వేతనాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో, ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా తమకు వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, అలాగే వికారాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా అనన్య కొనసాగుతున్నప్పటికీ, తెల్లవారుజామునే లేచి పట్టణ పరిశుభ్రత కోసం కష్టపడుతున్న పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం బాధాకరమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
వేతనాలు అందక ఇంటి ఖర్చులు, అద్దెలు చెల్లించలేకపోతున్నామని, తమ పిల్లల చదువుల కోసం పాఠశాల ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని కార్మికులు తెలిపారు.
గణేష్ మండపాల వద్ద పరిశుభ్రత పనులు చేయాలని, పండుగ రోజు నిరసనలు చేపట్టవద్దని రాజకీయ నాయకులు చెబుతున్నారని, అయితే పండుగ రోజైనా తమకు కొంత ఆర్థిక సహాయం అందించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ మూడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, లేకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మున్సిపల్ పారిశుధ్య కార్మికులు హెచ్చరించారు.

