Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Viral Video : టాయిలెట్‌లో ఇది కనిపిస్తే మీ పరిస్థితి ఏంటి..?

Viral Video : టాయిలెట్‌లో ఇది కనిపిస్తే మీ పరిస్థితి ఏంటి..?

hmtv 1 week ago

Snake-In-Toilet

Viral Video : ఫిలిప్పీన్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేద్దామని వెళ్లిన ఒక స్నేహితుల బృందానికి ఊహించని రీతిలో ప్రాణాపాయం తప్పింది. హోటల్ గదిలోని టాయిలెట్‌లో ఏకంగా ఒక కింగ్ కోబ్రా (రాజనాగు) ప్రత్యక్షమవ్వడంతో ఆ గదిలో ఉన్నవారంతా భయంతో వణికిపోయారు.

ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడుపుదామనుకున్న వారికి, ఈ భయంకరమైన అనుభవం జీవితాంతం గుర్తుండిపోయే ఒక పీడకలలా మిగిలిపోయింది.

టాయిలెట్ బౌల్‌లో టెర్రర్..

ఫిలిప్పీన్స్‌లోని ఉత్తర నెగ్రోస్ నేచురల్ పార్క్ పరిధిలోని సాల్వడార్ బెనెడిక్టోలో ఉన్న ఒక రిసార్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు స్నేహితులు కలిసి అక్కడ బస చేశారు. ఒకరోజు వారిలో ఒకరు బాత్‌రూమ్‌లోకి వెళ్లినప్పుడు టాయిలెట్ బౌల్‌లో ఏదో నల్లటి వస్తువు కనిపించింది. మొదట ఎవరో సరిగ్గా ఫ్లష్ చేయలేదని భావించి, అతను మళ్ళీ ఫ్లష్ చేశాడు. కానీ, ఆ తర్వాత జరిగిన దృశ్యం చూసి అతని గుండె ఆగినంత పనైంది. ఫ్లష్ చేయగానే పైపుల లోపల నుండి ఒక పాము తల బయటకు వచ్చింది. దీంతో వెంటనే బయటకు పరుగులు తీసి తన స్నేహితులకు విషయం చెప్పాడు.

నీటి పాము కాదు.. కింగ్ కోబ్రా.!

మొదట తన స్నేహితుడు చెబుతున్న మాటలను మిగతా వారు నమ్మలేదు. డ్రాన్‌రెబ్ టియోడోసో అనే వ్యక్తి ధైర్యం చేసి బాత్‌రూమ్‌లోకి వెళ్లి పరిశీలించాడు. ఒక పొడవైన కర్రతో టాయిలెట్ మూతను నెమ్మదిగా ఎత్తి, లోపల ఉన్న వస్తువును కదిలించాడు. అప్పుడు ఆ పాము మెల్లగా బయటకు వచ్చి, నాలుకను ఆడిస్తూ నేరుగా వీడియో తీస్తున్న వ్యక్తి వైపు చూడటం ఆ వీడియోలో రికార్డ్ అయింది. మొదట అది ఏదో విషం లేని సాధారణ నీటి పాము అని వారు భావించారు. కానీ, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నిపుణులను అడగగా, అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 'కింగ్ కోబ్రా' అని తెలిసి అందరూ షాక్‌కు గురయ్యారు.

అధికారుల విచారణ, కారణాలు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు , రిసార్ట్ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. సాల్వడార్ బెనెడిక్టో ప్రాంతంలో కింగ్ కోబ్రా సంచారం గురించి గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయని సూపర్ ఇన్ టెండెంట్ గినా గెరంగయ తెలిపారు. అయితే, ఇంత ప్రమాదకరమైన పాము హోటల్ టాయిలెట్ వరకు ఎలా వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఎవరైనా అక్రమంగా దాన్ని పెంచుకుంటూ ఉండగా అది తప్పించుకుని వచ్చి ఉండవచ్చని లేక బయట ఎండలు విపరీతంగా ఉండటంతో, చల్లదనం కోసం పైపుల ద్వారా బాత్‌రూమ్‌లోకి ప్రవేశించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

పర్యాటకులకు హెచ్చరిక

సాధారణంగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే రిసార్టులలో ఇలాంటి పాములు వచ్చే అవకాశం ఉంటుందని వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో చల్లటి ప్రదేశాల కోసం పాములు వెతుకుతుంటాయని, బాత్‌రూమ్‌లు వాటికి అనువైన స్థావరాలుగా మారుతాయని చెబుతున్నారు. పర్యాటకులు హోటల్ గదుల్లో ఉన్నప్పుడు బాత్‌రూమ్‌లు వాడే ముందు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని కలగలేదు, కానీ ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu